andra pradesh saintes warning ttd
mictv telugu

ఏపీలో కొత్త పార్టీ పెడతాం.. పీఠాధిపతుల వార్నింగ్

November 24, 2022

టీటీడీ అధికారుల వ్యవహార శైలిపై వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చారంటూ మండిపడ్డారు. శ్రీవారి దర్శనార్థం వీరంతా తిరుమలకు రాగా.. మహాద్వారం నుంచి దర్శనానికి అనుమతించకపోవడంపై నిరసన తెలిపారు. తాము వస్తున్నట్టు ముందుగా లేఖ రాసినా ఇలా చేస్తారా? అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనివాసం మంగాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో మార్పులు రాకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దింపుతామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలోనే ఏపీలోకి కొత్త పార్టీని స్థాపిస్తామని అన్నారు. తొందరలోనే తిరుపతిలో సభ ఏర్పాటు చేసి టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రకటిస్తామని చెప్పారు. రాజకీయ వేత్తలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శనభాగ్యం కలుగుతుందని ధ్వజమెత్తారు.