ఏపీ ఎస్సై ప్రాథమిక పరీక్ష ఆదివారం(ఫిబ్రవరి 19) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం, సాయంత్రం రెండు షిప్ట్‌లో పరీక్షను ఏపీఎస్ఎల్పీఆర్బీ(APSLPRB) నిర్వహించింది. 411 ఉద్యోగాలకు మొత్తం 1.51లక్షల మంది హాజరయ్యారు. 291 పరీక్ష కేంద్రాల్లో ఒక్క నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేశారు. ఇక పరీక్షకు సంబంధించిన ‘కీ’ ని అధికారులు నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎస్సై ప్రిలిమ్స్ కీ విడుదల కానుంది.‘కీ’ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 23 వరకు [email protected] కు అభ్యర్థులు మెయిల్ చేయొచ్చు. ఫలితాలు రెండు వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది.
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. గతనెల 22న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి వాటి ఫలితాలను కూడా విడుదల చేశారు. ఇక ఎస్సై పోస్టులకు ఆదివారం ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..వీరిలో 1.50లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.