Anger Tales Web series Review In Telugu Venkatesh Maha, Suhas
mictv telugu

Anger Tales Web series : యాంగర్ టేల్స్ రివ్యూ

March 9, 2023

Anger Tales Web series Review In Telugu  Venkatesh Maha, Suhas

 

సినీ ప్రేక్షకులకు ఓటీటీలు బాగా దగ్గరవడంతో ఆంథాలజీ, వెబ్ సిరీస్‌ల హవా కొన్నాళ్లుగా బాగా పెరిగింది. ఆ కోవలోనే హాట్ స్టార్‌లో లేటెస్ట్‌గా రిలీజైన ఆంథాలజీ .. యాంగర్ టేల్స్. తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా లాంటి డైరెక్టర్స్ నటించడంతో పాటు, సుహాస్ నిర్మాతగా ఏడు భాషల్లో రిలీజవడంతో ఈ ఆంథాలజీపై ప్రేక్షకుల్లో అంచనాలేర్పడ్డాయి. మరీ ఆంథాలజీ అంచనాలను అందుకుందా? ఇందులోని నాలుగు కథల్లో ఏ కథ ఎక్కువగా మెప్పించగలిగింది? అని విషయాలను గమనిస్తే..

కథల విషయానికొస్తే..

ఈ ఆంథాలజీలోని నాలుగు కథల్లో ఒక్కో కథది ఒక్కో నేపథ్యం, ఒక్కొక్కరిది ఒక్కో రకమైన కోపం. చివరగా ఎవరి కోపం ఎలా తీరింది? ఆ కోపం వల్ల మంచి జరిగిందా? చెడు జరిగిందా? అనేదే మెయిన్ థీమ్. ఫేవరేట్ హీరో బెన్ ఫిట్ షో లేట్ అవడంతో వచ్చే గొడవ వల్ల కోపం తెచ్చుకునే అభిమాని, వెజిటేరియన్ కుటుంబం కావడంతో ఆరోగ్యం కోసం గుడ్డు కూడా తినలేక కోపంతో ఊగిపోయే ఓ వైఫ్, మధ్యాహ్నం పూట అద్దె ఇంట్లో నిద్రకూడా సరిగ్గా పోవడానికి ఇబ్బందిపడుతూ ఏమీ చేయలేని కోపంతో బాధపడే ఓ ఇల్లాలు, బట్టతల వల్ల, ఇన్ సెక్యురిటీస్ వల్ల జీవితంలో ఏమీ సాధించలేక మదనపడే ఓ మిడిల్ క్లాస్ సగటు ఎంప్లాయ్. ఈ నాలుగు కథలతో తెరకెక్కిన ఆంథాలజీనే యాంగర్ టేల్స్.

కథనం విషయానికొస్తే..

ట్రైలర్‌లోనే నాలుగు కథల గురించి హింట్ ఇచ్చేశాడు దర్శకుడు తిలక్ ప్రభల. అయితే ఈ నాలుగు కథల్లో రంగా పాత్రలో వెంకటేష్ మహా నటించిన కథ, రాధ పాత్రలో బింధుమాధవి నటించిన కథలే ప్రేక్షకులకి కాస్త నచ్చేలా ఉంటే, మిగతా రెండు కథలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. కళాకారుడు షార్ట్ ఫిలింతో డైరెక్టర్ గా తిలక్ ప్రభల తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నా, ఈ ఆంథాలజీలో అన్ని కథలతో మాత్రం పెద్దగా ఆకట్టులేకపోయాడు. బట్టతలతో ఇబ్బండిపడే కథలతో హిందీలో బాలా, తెలుగులో నూటొక్క జిల్లాల అందగాడు లాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చేశాయి. దాంతో ఈ ఆంథాలజీలోనూ ఆ లైన్‌తో మరో కథ రావడంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలవకపోవచ్చు.

ఎవరెలా చేశారంటే..

స్టార్ హీరో వీరాభిమానిగా రంగా పాత్రలో వెంకటేష్ మహా నటన ఆకట్టుకుంటుంది. హౌజ్ వైఫ్ రాధ క్యారెక్టర్‌లో బింధుమాధవి పర్ఫామెన్స్ బాగుంది. డైరెక్టర్‌గా తిలక్ ప్రభల మేకింగ్, రైటింగ్ అన్ని కథల్లో వర్కవుట్ కాలేదు. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు పచ్చబొట్టు శీను పాత్రలో సుహాస్ చేసిన యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింప్లీ సూపర్బ్. మ్యూజిక్ డైరెక్టర్‌గా స్మరణ్ సాయికి మంచి మార్కులు పడ్డాయి. ఒక్కో నేపథ్యంతో సాగే కథలకి ఒక్కో రకమైన సంగీతంతో అలరించాడు. అన్ని కథల్లోనూ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్, ఎడిటింగ్ తో పాటు టెక్నికల్ పరంగా అందరూ తమ మేరకు జస్టిఫై చేశారు.

ఓవరాల్ గా ఎలా ఉందంటే…

యాంగర్ టేల్స్ ఆంథాలజీలో రంగా, రాధా కథలు మాత్రమే ఆకట్టుకోగలిగాయి. అలా అని మరీ అంచనాలు తెగ పెంచేసుకుని యాంగర్‌కి లోనవ్వకుండా టైమ్ పాస్ కోసం ఓసారి చూసేయొచ్చు.