అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకోవడం అంటే ఇదే. భార్యపై కోపంతో ఓ ప్రబుద్ధుడు ఆమె ప్రేమగా పెంచుకునే కుక్కను దారుణంగా హత్య చేశాడు. ఈ ఉదంతం తమిళనాడులోని వేళచ్చేరిలో జరిగింది.
వేళచ్చేరి రెండో నగర్‌కు చెందిన భారతి(32) బ్యూటీపార్లర్ నడుపుతూ జీవిస్తోంది. ఆమె అదే ప్రాంతానికి చెందిన జగన్నాథన్ (36)ను ఐదేళ్లుగా ప్రేమించి ఏప్రిల్ 4న పెళ్లి చేసుకుంది. మద్యానికి బానిసైన జగన్నాథన్ ప్రతి రోజూ భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. ఈ క్రమంలో వారు ఇటీవల కొత్త ఇంటికి మారారు. భారతి తాను పెంచుకుంటున్న కుక్కను కూడా ఆ ఇంటికి తీసుకెళ్లింది. ఈ నెల 22న పూటుగా మద్యం తాగొచ్చి జగన్నాథన్ కుక్క సాకుతో మళ్లీ గొడవ పడ్డాడు. శుభమా అని కొత్తింట్లోకి వస్తే ఆ కుక్కను కూడా వెంటబెట్టుకొస్తావా అని తిట్టాడు. సహనం కోల్పోయి ఆమెపై దాడి చేయగా ఆమె పారిపోయంది. దీంతో అతగాడు కుక్కపై ప్రతాపం చూపించాడు. దాన్ని తీవ్రంగా కొట్టి హింసించాడు. దీంతో కుక్క ప్రాణాలను కోల్పోయింది. జగన్నాథన్పై భార్య వేళచ్చేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగన్నాథన్‌ను అరెస్ట్ చేశారు.