Angry snake..bites five times in one place, but..
mictv telugu

పగబట్టిన పాము..ఒకేచోట ఐదుసార్లు కాటు, అయినా..

September 17, 2022

Angry snake..bites five times in one place, but..

యువకుడిని పగబట్టిన ఓ విషసర్పం పది రోజుల్లో ఐదుసార్లు ఒకేచోట కాటేయడం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. అయినా కూడా ఆ యువకుడు ప్రాణాలతో బయటపడడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, అతని తల్లిదండ్రులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ఆ విషసర్పం తమ కొడుకును మళ్లీ ఎప్పుడో కాటేస్తుందోనని భయాందోళనకు గురౌతున్నారు. అయితే, ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్స్..’ఒకే పాము, ఒకే వ్యక్తిని, ఒకే చోట కాటు వేయడం సాధ్యమేనా?, అలా ఎలా కాటు వేస్తుంది?’ అంటూ సందేహాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మలప్పురా ప్రాంతంలోని మన్ కేథా గ్రామంలో నివాసముంటున్న రామ్ కుమార్ చాహర్ తనయుడైన 20 ఏళ్ల రజత్ చాహర్ పదే పదే పాము కాటుకు గురవుతున్నాడు. అయితే, సమయానికి వైద్యం అంది, అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆ యువకుని కుటుంబ సభ్యులు తెగ ఆందోళన చెందుతున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..”నా కూమారుడు రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి 9.00 గంటలకు ఇంటి బయట నడుస్తుండగా, ఓ పాము ఎడమకాలిపై కాటేసింది. భయంతో రజత్ కేకలు వేశాడు. దాంతో ఇంట్లోనుంచి మేము బయటికి వచ్చేసరికి ఆ పాము వెళ్లిపోయింది. వెంటనే మా అబ్బాయిని ఆగ్రాలోని ఎస్. ఎన్. వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు పాముకాటు లక్షణాలేవీ కనిపించడం లేదని, ఇంటికి పంపేశారు. మళ్లీ సాయంత్రం.. ఇంటి ఆవరణలో ఉన్న స్నానాలగదికి వెళ్లాడు. అక్కడే ఉన్న పాము మరోమారు ఎడమకాలిపై కాటేసింది. ఈసారి ముబారకపూర్ తీసుకువెళ్లి, వైద్యం చేయించాం. ఇదేవిధంగా 11, 13, 14 తేదీల్లో రజతను పాము కరిచింది. ఎందుకు అతడినే వెంటాడుతోందో, ఒకేచోట కాటేయడం ఏమిటో తెలియక సతమతమవుతున్నాం” అని కన్నీరు మున్నీరు అయ్యారు.