ఫీజులు కట్టడానికి బంగారం అమ్ముకున్నా.. అంబానీ  - MicTv.in - Telugu News
mictv telugu

ఫీజులు కట్టడానికి బంగారం అమ్ముకున్నా.. అంబానీ 

September 26, 2020

Anil Ambani to UK court, 'have sold all jewellery to pay legal fees'

చట్టపరమైన ఫీజులు కట్టడానికి బంగారం అమ్ముకున్నానని  రుణాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త, దేశంలోనే ధనవంతుల్లో ఒకరిగా కొనసాగిన అనిల్ అంబానీ తెలిపారు. తాను సాధారణ జీవితం గడుపుతున్నానని.. ఒక్క కారు మాత్రమే వాడుతున్నానని చెప్పారు. భారత్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూకే హైకోర్టు ఎదుట హాజరైన ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి వివరించారు. అంబానీ సంస్థ ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే యత్నాల్లో భాగంగా ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్‌ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్‌ ఆయనను బ్రిటన్‌లో కోర్టుకు లాగాయి. ఈ మూడు బ్యాంక్‌లకు 717 మిలియన్‌ డాలర్లతో పాటు ఇతర ఖర్చులను 21 రోజుల్లోగా చెల్లించాల్సిందిగా కోర్టు ఈ ఏడాది మే 22న ఆదేశాలు జారీచేసింది. జూన్‌ 12తో ఆ గడువు ముగిసింది. అయినా ఆయన ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీంతో ఆ బ్యాంకులు ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించాయి. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం విచారణను ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో న్యాయవాది మీరు నిజాయితీగా ఆధారాలు వెల్లడించడం లేదు అని పలు ప్రశ్నలు సంధించారు. తన వద్ద 1,11,000 డాలర్ల విలువైన కళాకృతి మాత్రమే ఉందని అనిల్ అంబానీ చెప్పారు. ‘నా తల్లికి రూ.500 కోట్లు, కుమారుడు అన్‌మోల్‌కు రూ.310 కోట్లు రుణపడి ఉన్నాను. అలాగే నేను రిలయన్స్‌ ఇన్నోవెంచర్స్‌ కోసం రూ.5 బిలియన్ల రుణం తీసుకున్నాను. ఆ కంపెనీలో ఉన్న 12 మిలియన్ల షేర్లు ఇప్పుడు దేనికి పనికిరావు. కుటుంబ ట్రస్ట్‌తో సహా, ప్రపంచ వ్యాప్తంగా ఏ ట్రస్ట్‌ వల్ల నేను ప్రయోజనం పొందడంలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నేను ఎలాంటి ప్రొఫెషనల్ ఫీజు పొందలేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ ఏడాది ఆశించడం లేదు’ అని తెలిపారు. మరోవైపు సొంత హెలికాప్టర్‌, కారు, ఇతర ఆస్తుల గురించి ప్రశ్నించారు. దానికి ఆయన తన ఖర్చులు చాలా తక్కువ అని తెలిపారు. తన భార్య, కుటుంబం వాటి ఖర్చులను భరిస్తోందని.. తనకు ఇతర ఆదాయాలు కూడా లేవని అన్నారు. ప్రస్తుతం తాను ఒక కారు మాత్రమే వాడుతున్నానని వివరించారు.

తన వద్ద ఎప్పుడూ రోల్స్‌రాయిస్ కారు లేదని.. అవన్నీ మీడియా కట్టుకథలు అని చెప్పారు. ‘నేను ఆభరణాలు అమ్మి చట్టబద్ధమైన ఫీజులు చెల్లిస్తున్నాను. ముందుముందు మరిన్ని ఖర్చులు ఎదురైతే, ఇతర ఆస్తులకు సంబంధించి కోర్టు ఆమోదానికి లోబడి ఉంటాను. నేను హెలికాప్టర్‌ను వ్యక్తిగతంగా ఉపయోగించకపోతే, దానికి నేను ఏమీ చెల్లించను. లాక్‌డౌన్ కారణంగా దానిని వాడలేదు. అందుకే నా దగ్గర ఎలాంటి బిల్లులు లేవు. లండన్‌, కాలిఫోర్నియా, బీజింగ్‌లో షాపింగ్ చేసినట్లు ఉన్న క్రెడిట్ కార్డు బిల్లులు నా తల్లి కోసం చేసిన షాపింగులవి. ఎనిమిది నెలల కాలంలో వచ్చిన రూ.60.6 లక్షల ఎలక్ట్రికల్ బిల్లుకు అధిక టారిఫే కారణం’ అని అనిల్ అంబానీ స్పష్టంచేశారు. కాగా, విచారణ అనంతరం అనిల్ ప్రతినిధి, చైనా బ్యాంకులు ప్రకటనలు విడుదల చేశాయి. అనిల్ సాధారణ జీవితాన్ని గడిపే, అతి సాధారణమైన అభిరుచులు కలిగిన వ్యక్తి అని పేర్కొన్నాయి.