వాళ్లిద్దరూ క్రికెట్ లో హీరోలే..ఒకరు బ్యాటింగ్ లో..మరొకరు బౌలింగ్ లో. కుంబ్లే గతమైతే.. కోహ్లీ వర్తమానం.ఇప్పడు అనిల్ కుంబ్లే బౌలింగ్ వేస్తున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. థర్డ్ ఎంపైర్ గా బీసీసీఐ వ్యవహరిస్తుంది. కుంబ్లే స్పిన్ మేజిక్ కు..ఇప్పటికే రాజీనామాతో డిఫెన్స్‌లో పడిపోయిన విరాట్ కోహ్లీ డకౌట్ అవుతాడా…?తన మార్క్ స్టయిలిష్ బ్యాటింగ్ తో వీరవిహారం చేస్తాడా…ఈ వార్ లో గెలుపెవరిది…? కొత్త కోచ్ గా రవిశాస్త్రి రాబోతున్నారా..? వచ్చే కొత్త కోచ్ కోహ్లీని కట్టడి చేస్తాడా..?ప్రెండ్లీగా ఉంటాడా..?మళ్లీ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్నట్టు ధోనీయే కావాలాంటాడా..?
కుంబ్లే, కోహ్లి ల మధ్య వార్ ముదిరింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఈనాటివి కావట. ఆర్నెళ్ల నుంచే మాట్లాడుకోవడం లేదంట. మొన్న చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకోవాలని కుంబ్లే సూచించాడట. అయితే కోహ్లి మాత్రం ముందే డిసైడైనట్లు ఫీల్డింగ్ ఎంచుకున్నాడట. నిజానికి ముందు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే.. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరుగుతుందని కుంబ్లే భావించాడు. కానీ విరాట్ ఫీల్డింగ్ తీసుకోవడం.. చివరకు బొక్క బోర్లా పడటంతో ఘోరంగా ఓడింది.
స్కూల్ పిల్లల్లా ట్రీట్ చేశాడని, ఫైనల్లో ఓడిన తర్వాత ప్లేయర్ల అందరినీ కుంబ్లే తిట్టాడట. ఈ ఘటనతో విరాట్, కుంబ్లే మధ్య విభేదాలు మరింత ముదిరాయట. టీమ్ మెంబర్స్‌కు స్వేచ్ఛ కోరుకునే కోహ్లి.. కుంబ్లే తీరుతో విసిగిపోయాడట. ఇక డ్రెస్సింగ్ రూమ్ ఎవరి ఆధీనంలో ఉండాలన్న విషయం ఆగ్ని ఆజ్యం పోసింది. కుంబ్లే తాను చెప్పినట్లుగా వినాలని ఆర్డరేస్తే.. కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోలేదట.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలవ్వడం, ఆ తర్వాత రెండు రోజులకే కుంబ్లే కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో షాకైన ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా.. కుంబ్లే రాజీనామాను పరిగణలోనికి తీసుకున్న బీసీసీఐ వెంటనే దాన్ని తిరస్కరించింది. ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని మరొకరు కోరారు. అంతేకాదు ధోనీ సారథిగా ఉన్న సమయంలో జట్టులో మంచి వాతావరణం ఉండేది. కోచ్‌లతో కూడా ధోనీ సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కోహ్లీ కంటే ధోనీనే మెరుగైన సారథి. బీసీసీఐ వెంటనే కోహ్లీపై చర్యలు తీసుకోవాలి. సారథిగా కోహ్లీ టీమిండియాను నడిపించలేడు. దయచేసి ధోనీని కెప్టెన్‌గా నియమించండి అని వరుస ట్వీట్లతో అభిమానులు బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
ఇకఫ్రెండ్లీ కోచ్ కావాలంటూ డైరెక్ట్ గా రవిశాస్త్రి పేరు చెప్పడంతో కోహ్లి ముందు పూర్తిగా బెండ్ అయింది బోర్డు. ఇప్పుడు విరాట్ కోసమే మాజీ టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రిని తెరపైకి తెచ్చింది. కోచ్ పదవి కోసం మరిన్ని అప్లికేషన్స్ ఆహ్వానించాలని బోర్డు నిర్ణయించడం ఇందులో భాగమే. కానీ గతేడాది గంగూలీ చేతిలో అవమానాన్ని ఇంకా మరచిపోని రవి.. ఇప్పుడు ఈగో సాటిస్ ఫై కోసం బోర్డుతో చెడుగుడు ఆడుకుంటున్నాడు. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో వుండను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తా అంటేనే చేస్తా అని తేల్చి చెప్పేశాడు. బోర్డు దిగిరాక తప్పలేదు. బోర్డు దిగొచ్చినా రవిశాస్త్రి కోచ్ అవడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే గంగూలీతో ఉన్న విభేదాలే కారణం. శాస్త్రిలాగే గంగూలీ కూడా జగమొండి . ఎవరి మాట వినని సీతయ్య .ఇటు ఈ ఇద్దరూ.. అటు కెప్టెన్ కోహ్లి మధ్య బీసీసీఐ కి బ్యాండ్ బాజా మోగుతుంది.
మరోవైపు అప్పట్లో కోచ్ గా కుంబ్లే ను ఆహ్వానిస్తూ ట్విట్టర్ లో చేసిన ట్విట్ ను కోహ్లీ..తాజా పరిణామాల మధ్య తన అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు.ఇది రచ్చ రచ్చకు దారితీసింది. క్రికెట్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్విట్ల వర్షం కురిపించారు. మొత్తానికి అసలు క్రికెట్ …కొసరు క్రికెటే ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తోంది.