Anil Kurmachalam Released The Teaser Of Shaheed Shoyabullah Khan
mictv telugu

తెలంగాణ జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ బయోపిక్ టీజర్ రిలీజ్

September 20, 2022

షోయబుల్లా ఖాన్.. అతికొద్దిమందికి తెలిసిన ఓ ప్రముఖ పాత్రికేయుని పేరు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చిన వ్యక్తి. రాజరిక పాలనను ముగింపు పలకాలంటూ.. భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేయాలంటూ అక్షర పోరాటం చేశాడు. నిజాంకు వ్యతిరేకంగా ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను రాశాడు. షోయబుల్లా ఖాన్ రచనలను సహించలేని రజాకర్లు అతి దారుణంగా ఆయన్ని హతమార్చారు. 1948 నాటి వాస్తవిక సంఘటన ఆధారంగా ఆ పాత్రికేయుని సాహసగాథను ‘షహీద్ షోయబుల్లా ఖాన్’ పేరుతో త్వరలో సినిమాగా రాబోతుంది.

తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సమర్పణలో శీలం లింగారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను వి.ఆర్.టి. దీపక్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం ఆవిష్కరించారు. దీపక్, మధుబాల, మిథున్ చక్రవర్తి, అలీ, నాజర్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు చిన్నికృష్ణ సంగీతం అందించారు. ఈ చిత్రానికి దీపక్ తో పాటు శ్రీనివాస్ రాజలింగం మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.