తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మహేందర్‌రెడ్డి నుంచి డీజీపీగా బాధ్యతలు అందుకున్నారు. అనంతరం డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికే ఆదర్శం. ప్రతి అధికారి లీడర్‌గా పనిచేయాలి. క్విక్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రజలకు నిరంతరం రక్షణగా ఉంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర డీజీపీగా నియమితులైన అంజనీకుమార్‌కు ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఐపీఎస్ అధికారుల్లో సీనియార్టీ జాబితాలో అంజనీకుమార్ ముందువరుసలో ఉన్నారు. 1966 జనవరి 28న బీహార్‌లో జన్మించిన అంజనీ కుమార్.. పాట్నా సెయింట్ జేవియర్ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత విద్య ను, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. ఐపీఎస్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు రెండు అవార్డులతోపాటు రాష్ట్రపతి పోలీసు మెడల్ అందుకొన్నారు. 1992లో జనగామ ఏఎస్పీగా నియమితులైన అంజనీకుమార్ అంచెలంచెలుగా ఎదిగి డీజీపీ అయ్యారు. 2026 జనవరిలో పదవీవిరమణ చేయనున్నారు.
1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్.. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్‌గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. ఐపీఎస్ ట్రైనింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు. ఇక ఇవాళ ఉదయం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.