Home > Social > ఎవరీ అంకిరెడ్డి.. సోషల్ మీడియాలో ఎందుకింత ఫాలోయింగ్ ?

ఎవరీ అంకిరెడ్డి.. సోషల్ మీడియాలో ఎందుకింత ఫాలోయింగ్ ?

అంకిరెడ్డి ఎవరు ? ఆ మహానుభావుణ్ని తలుచుకొని ఈ మూడు రోజుల నుండి సోషల్ మీడియా నిండా దుఖ్ఖం ధారలై ప్రవహిస్తూనే వుంది. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తనువు చాలించాడు అంకిరెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కెరటమై ఎగిసిపడ్డ అంకిరెడ్డి అలియాస్ అంకిరెడ్డి గోపీకృష్ణా రెడ్డి. ఎంబిఏ పూర్తి చేసి సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు. రెండు మూడు కంపెనీల్లో ఇంటర్వ్యూలకు కూడా హాజరైనట్టు తన స్నేహితులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాడట కూడా. కానీ అంతలోనే తను కన్న కలలను కల్లోలం చేస్కొని శవమై, తీరని దుఖ్ఖాన్ని అమ్మానాన్నల వశం చేస్తూ విగతజీవిగా తిరిగొచ్చాడు ?

ఫోటో గ్రాఫర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా తనదైన మద్రను చాటుకున్నాడు. తెలంగాణ తల్లి తనను తాను ఆవిష్కరించుకున్నాక కూడా ఇంకా తన బిడ్డలను పోగొట్టుకుంటూనే వుందా ? హయ్యో.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఆ బిడ్డ చేసిన త్యాగాల చరిత్రను తనతో పాటే తీస్కెళ్ళిపోయాడా ? అంకిరెడ్డన్నా.. అంకిరెడ్డన్నా.. ఎంత పని జేస్తివి అన్నా అని కొందరు ఆప్తులు, అప్పుడే నీకు నిండునూరేండ్లు నిండినయా కొడుకా అని అమ్మానాయినలు.., అంకిరెడ్డిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చేస్తున్నారు.

నా బిడ్డ ఈ గడ్డ మీదే వుండుంటే కాపాడుకునేదాన్నని అనుకున్నదేమో.. ఎక్కడో సుదూర దేశంలో మృత్యువుతో ఇలా దోస్తీ కట్టి పరాకుగా వెళ్ళిపోతాడని నేనస్సలు వూహించలేదని, బహుశా తెలంగాణ తల్లి కూడా ఆకాశానికి అర్రులు జాచి గొడోమని షుష్కిస్తున్నట్టున్నది ?? ఎంత ఏడ్చినా ఏం లాభం తల్లీ.. గర్భ శోకంతో తల్లడిల్లుతున్న ఆ కన్నతల్లి కడుపుకోతను ఏ మహిమా వచ్చి చల్లార్చలేదు కదా ? మంచితనానికి మారుపేరైన ధీటైన వ్యక్తిత్వం కలిగిన అంకిరెడ్డిని ఇంత నిర్దయగా తీస్కెళ్ళడానికి ఆ మృత్యువుకెలా మనసొప్పింది ? దాన్ని పురమాయించిన ఆ భగవంతుడికి దిల్ లేదా ? సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలాలను స్వీకరిస్తున్న తరుణంలోనే తనకా బాకీ లేదన్నట్టు వెళ్ళిపోయాడు ?? ఎంత అన్యాయం ???

అసలేం జరిగింది ?

అంకిరెడ్డి జూన్ 24 వ తారీకున సౌతాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ తన ఫ్రెండ్స్ సహకారంతో వివిధ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు కూడా అటెండ్ అయ్యాడు. కార్లో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు వీళ్ళు ప్రయాణిస్తున్న కారును 200 స్పీడుతో వచ్చి ఢీకొన్నది. గుద్దుకున్న ఆ కారు బ్లాస్ట్ అయి ముగ్గురు నల్ల జాతీయులు అందులోనే సజీవ దహనమయ్యారు. అంకిరెడ్డితో రాజగోపాల్ అనే కడప వాస్తవ్యుడు ఇద్దరు వెనక సీట్లో కూర్చున్నారు. ముందు సీట్లో ఇంకొక మిత్రుడు వున్నాడు. డ్రైవర్ అక్కడి వాడే. అయితే ప్రమాదం జరిగినప్పుడు ముందు కూర్చున్న వాళ్ళకు బెలూన్లు వుండటంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. కానీ వెనక కూర్చున్న వీళ్ళిద్దరు బెల్టు సీటు పెట్టుకోకపోవడంతో, పల్టీ కొట్టిన కార్లో ఎగిరెగిరి పడటంతో దెబ్బలు బలంగా తగిలాయని అక్కడి కథనం. ప్రమాదం జరిగాక కొంత సేపటివరకు అంకిరెడ్డి మాట్లాడట కూడా. నొప్పి భరించడం వశం కాక కొంత దూరం నడిచివెళ్ళి ‘ ఓం నమ:శివాయ: ’ చదువుకుంటూ కుప్ప కూలాడట.

అంకిరెడ్డి గోపీకృష్ణా రెడ్డి

వెంకట్ రెడ్డి, జయప్రద దంపతుల ముద్దుల కొడుకు అంకిరెడ్డి. ఖమ్మం జిల్లా, వందనం గ్రామంలో జన్మించాడు. అక్క జ్యోతి తర్వాత ఒక్కడే. ఆ ఒక్కడే తమకు గొప్ప ఆదెరువు అవుతాడనుకున్నారు ఆ అమ్మానాన్నలు. తెలంగాణ ఉద్యమంలో ‘ తెలంగాణ ఆజాద్ ఫోర్స్ ( TAF ) ’ గ్రూపు సభ్యునిగా కీలకంగా వ్యవహరించాడు. ఇప్పటికీ TAF, జిందగీ ఇమేజెస్ గ్రూపుల్లో చాలా ఆక్టివ్ గా పాల్గొనేవాడని ఫ్రెండ్సందరూ ఎడతెరిపి లేని బాధతో కల్లోల సముద్రాలై ఉప్పొంగుతున్నారు. ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తాడని ఎవరూ కల్లో కూడా అనుకోకపోవచ్చు ?

తన మరణవార్త తెలిసినప్పటి నుండి హైదరాబాదు నగరంలో వివిధ ప్రజా సంఘాలు ‘ జోహార్ అంకిరెడ్డి ’ అని నినదించాయి. గన్ పార్క్ సాక్షిగా నివాళులు అర్పించారు. వేల సంఖ్యలో జనాలు వచ్చి అతని అంతిమ యాత్రలో భాగం పంచుకున్నారు. బ్రైట్ ఫ్యూచర్ కోసం కలలు కన్న ఒక వెలుగు కిరణం మసిబారిపోయిందిప్పుడు. జోహార్ అంకిరెడ్డి జోహార్ !!

Updated : 17 July 2017 6:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top