కల్యాణ మండపంగా మారిన ‘అమ్మ’ సమాధి - MicTv.in - Telugu News
mictv telugu

కల్యాణ మండపంగా మారిన ‘అమ్మ’ సమాధి

September 12, 2019

Anna DMK Leader Decks Up Jayalalitha's Samadhi

తమిళులు అమ్మగా పిలుచుకునే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే ఆ రాష్ట్ర ప్రజలకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెపై అభిమానంతో గుడి కూడా కట్టారు. ఆమె మృతిచెంది మూడేళ్లయినా వారిలో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నారు. 

అమ్మపై ఉన్న అభిమానాన్ని ఓ అన్నాడీఎంకే నేత వినూత్నంగా చాటుకున్నారు. ఎస్‌.భవానీ శంకర్‌ అనే అన్నాడీఎంకే తన కొడుకు ఎస్పీ సాంబశివరామన్‌-దీపికల వివాహాన్ని మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత స్మారకం వద్ద బుధవారం నిర్వహించారు. తమిళనాడు సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి వైభవంగా జరిగింది. ‘అమ్మ’ సమాధి ఎదురుగా ఎస్పీ సాంబశివరామన్‌-దీపికలు ఒక్కటయ్యారు. జయలలిత ఆశీస్సుల కోసమే ఇక్కడ వివాహం జరిపించినట్లు భవానీ శంకర్‌ తెలిపారు. ఈ వివాహానికి అన్నా ఏడీఎంకే నేతలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకను పురస్కరించుకుని జయలలిత సమాధిని పూలతో అలంకరించారు. వీళ్ళు మాత్రమే కాకుండా మరికొందరు వధూవరులు అమ్మ సమాధి ఎదుట వివాహం చేసుకోవడం విశేషం.