కేజ్రీవాల్ అధికార ‘మత్తు’లో మునిగిపోయారు.. అన్నా హాజారే బహిరంగ లేఖ
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహాజారే తీవ్ర విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ అధికార మత్తులో తూలుతున్నారని, అవినీతికి వ్యతిరేక సిద్ధాంతాలను పక్కనబెట్టేశారని దుయ్యబట్టారు. ఓ మంచి లక్ష్యంతో ఆవిర్భవించిన ఆప్ ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీల్లా మారిపోయిందన్నారు. మంగళవారం ఢిల్లీ మద్యం పాలసీపై విమర్శలను ఎక్కుపెడుతూ.. బహిరంగ లేఖ రాశారు అన్నా హజారే. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆయన పాలనపై హజారా స్పందించడం గమనార్హం.
మద్యం విధానంపై ఆదర్శాలను పూర్తిగా కేజ్రీవాల్ మరిచిపోయారని సామాజిక ఉద్యమకారుడు దుయ్యబట్టారు. కేజ్రీవాల్ తాను రాసిన ‘స్వరాజ్’ పుస్తకంలో మద్యం విధానంపై పేర్కొన్న ఆదర్శాలను పూర్తిగా మరిచిపోయారు. లోక్‌పాల్ కోసం కృషిచేయడం.. పటిష్ఠ లోకాయుక్త చట్టాన్ని తీసుకురావడం.. అవినీతిని అంతమొందించడం వంటి సిద్ధాంతాలను పక్కన పెట్టేశారు. అవినీతి మద్యం పాలసీని తీసుకొచ్చారు. జనలోక్‌పాల్… పటిష్ఠ లోకాయుక్త చట్టాన్ని తీసుకురావడం.. అవినీతిని అంతం చేయడం వంటి సిద్ధాంతాలను పక్కన పెట్టేశారు.. మహిళలకు వ్యతిరేకమైన మద్యం పాలసీని తీసుకువచ్చారు. ఇలాంటి మద్యం విధానం దేశంలో ఎక్కడా లేదు’’ అని హజారే ఆ లేఖలో ధ్వజమెత్తారు. మద్యం మాదిరిగానే అధికారం కూడా సీఎం కేజ్రీవాల్‌ను మత్తులో ముంచెత్తినట్లు కనిపిస్తోందని విమర్శించారు.