అప్పిరెడ్డి అందరికీ ఆదర్శం.. ఏడేళ్లుగా వందలాది విద్యార్థులకు చేయూత.. - MicTv.in - Telugu News
mictv telugu

అప్పిరెడ్డి అందరికీ ఆదర్శం.. ఏడేళ్లుగా వందలాది విద్యార్థులకు చేయూత..

March 14, 2019

‘ప్రార్థించే పెదవులకన్నా ఆదుకునే చేతులు మిన్న’ అన్నారు మదర్ థెరిసా. ఈ ఆదర్శాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు అన్నపరెడ్డి అప్పిరెడ్డి. కేవలం నీతిసూత్రాల వల్లింపులు, ప్రచార ఆర్భాటం కాకుండా, అత్యంత నిబద్ధతతో ఆయన పేద విద్యార్థులకు అన్నీ తానై ఆదుకుంటున్నారు. ఏడేళ్లుగా వందలాది విద్యార్థులకు ఆయన చేయూత అందిస్తున్నారు. ఆర్థికంగా, హార్దికంగా ఆదుకుంటున్నారు.

ఏడేళ్ల కిందట..

చదువుకోవాలనే తపన ఉన్నా ప్రతికూల పరిస్థితుల కారణంగా మన దేశంలో కోట్లాది మంది పిల్లలు బడికి నోచుకోవడం లేదు. బాలకార్మికులుగా మారి దయనీయ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఆడిపాడాల్సిన వయసులో పిల్లలు కూలి పనులకు వెళ్తున్నారు. టీనేజ్‌లోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి అప్పిరెడ్డిని కలచి వేసింది. తనకు విద్యాబుద్ధులు నేర్పి, తన ఎదుగుదలకు దోహదపడిన సూర్యాపేట జిల్లా  దొండపాడు గ్రామం నుంచే తన సేవకార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా ఆయన మనసెప్పుడూ దొండపాడుపైనే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆయనకు అక్కడ చదువుకునే పిల్లల కష్టాలేంటో బాగా తెలుసు. అందుకే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 2012లో అమ్మమ్మ, తాతయ్య ఆదెమ్మ, హుస్సేన్‌రెడ్డి పేరుతో ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. మాతృభూమి రుణాన్ని ఇలా కొంతైనా తీర్చుకోవడానికి తపన పడుతున్నారు.

 

ప్రతిభావంతులైన విద్యార్థులకు గుర్తించి వారికి ఏటా కొన్ని వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నారు అప్పిరెడ్డి. దుస్తులు, పుస్తకాలు, పెన్నులు వంటి సామగ్రి కూడా అందిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 80 మంది విద్యార్థులకు రూ. 4 లక్షలకుపైగా ఆర్థిక సాయాన్ని అప్పిరెడ్డి అందించారు. వచ్చే ఏడాది 200 మందికి సాయం చేయనున్నారు. కొన్ని ఎన్జీఓలు, కొందరు దాతలు.. మొదట్లో ఉత్సాహంగా సేవాకార్యక్రమాలు ప్రారంభించి తర్వాత పెద్దగా పట్టించుకోరు. కానీ అప్పిరెడ్డి మాత్రం మొదట్లో ఉన్న ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలను ఒక సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పంద్రాగస్టు, రిపబ్లిక్ డే వంటి అనేక సందర్భాల్లో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను స్వయంగా  కలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

నిన్న(బుధవారం) దొండపాడులో జరిగిన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ ఏడో వార్షికోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ.. చెప్పిన మాటలు ఆయన మంచిమనసుకు అద్దం పడతాయి.. ‘ఎన్ని వ్యాపారాలు చేసినా దొరకని తృప్తి నాకు ఈ ఫౌండేషన్ సేవల ద్వారా కలుగుతోంది. మా అమ్మమ్మ, తాతయ్యల చేతుల్లో పెరిగిన నేను వారికి అర్పించే నివాళి ఇదే.. ’ అని అన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. విద్య అందరికీ అవసరం అని, అది మనిషికి అజ్ఞానాన్ని పోగొట్టి, జీవితాన్ని పరిపూర్ణం చేసే జ్ఞానజ్యోతి అని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు చాలా మంది చెబుతుంటారు. కానీ నేను సైతం అని ముందుకొచ్చి, నిస్సార్థంగా సేవ చేసేవారు కొందరరే ఉంటారు. ఆ కొందరిలో ముందు వరసలో ఉంటారు అప్పిరెడ్డి.