తెలంగాణ గురుకులాల్లో మరో 1,000 ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ గురుకులాల్లో మరో 1,000 ఉద్యోగాలు

June 23, 2022

తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో బోధనేతర విభాగానికి సంబంధించి కొత్తగా మరో వెయ్యి కొలువులు ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. తాజాగా నాలుగు గురుకుల సొసైటీల్లో 9,096 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవన్నీ బోధన విభాగానికి సంబంధించిన ఉద్యోగాలు. తాజాగా మరో వెయ్యి బోధనేతర ఉద్యోగాలను అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అనుమతులు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యిందని సమాచారం. ఈ బోధనేతర ఖాళీలకు సంబంధించి గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదికను సమర్పించాయి.

గురుకుల సొసైటీలు సమర్పించిన నివేదికలో..’తాజాగా గుర్తించిన ఖాళీలన్నీ జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌కు చెందినవే. వెయ్యి జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో అత్యధికం బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. దాదాపు 450 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు బీసీ గురుకుల సొసైటీలోనే ఉన్నాయి. ఆ తర్వాత 300 పోస్టులు మైనార్టీ, 150 పోస్టులు ఎస్సీ, మరో 100 పోస్టులు ఎస్టీ గురుకుల సొసైటీలో ఉన్నాయి.” అని పేర్కొన్నారు.ఈ ఉద్యోగాలకు త్వరలోనే భర్తీకానున్నట్లు సమాచారం.

అయితే, గురుకుల సొసైటీలు గుర్తించిన ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గురుకుల విద్యా సంస్థల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ బాధ్యతలు టీఎస్‌పీఎస్సీకే ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ పోస్టులను కూడా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు.