ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మల్కాజ్గిరి ఏసీపీ నరసింహా రెడ్డి కేసులో మరొక 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్‌లోని రెండు వేల గజాల స్థలం వివాదంలో జోక్యం చేసుకున్న నరసింహారెడ్డి బినామీల పేర్లతో మాదాపూర్ స్థలాన్ని దక్కించుకున్నట్టు ఏసీబీ అధికారులు తమ విచారణలో తేల్చారు. ఆ స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపుగా రూ.50 కోట్ల విలువ ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎనిమిది మంది కలిసి తప్పుడు పత్రాలతో సదరు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్ధారణకు వచ్చిన ఏసీబీ వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది.
మరోవైపు మాదాపూర్‌కు చెందిన ఒక మహిళ పేరు మీద నరసింహారెడ్డి ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. గతంలో కూడా ఒక ఎస్సైని పెట్టుకుని అతని చేత భూ అక్రమాలు చేయించినట్టు కూడా గుర్తించారు. ఇక విచారణ ముగిసే నాటికి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తుల విలువ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, రూ.70 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల వివరాలను సేకరించిన ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. వరంగల్‌లో మూడు చోట్ల, కరీంనగర్, నల్గొండలో రెండు చోట్ల, హైదరాబాద్‌లోని మహేంద్రహిల్స్, డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్, హఫీజ్ పేట్లలో ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి, హఫీజ్‌పేట్‌లో మూడు అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ సహా రెండు ఇండిపెండెంట్ ఇళ్లు, సైబర్ టవర్స్ ఎదురుగా 1,960 గజాల భూమి, మరో 4 ప్లాట్లను గుర్తించారు.