హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఐదుగురు లైంగిక దాడి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై ఐదుగురు లైంగిక దాడి

June 7, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గతకొన్ని రోజులుగా వరుస అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఐదుగురు విద్యార్థులు కలిసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఖార్ఖానాలో జరిగింది.

ఖార్ఖానా ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..’ఖార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే బాలిక పదవ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన ఓ విద్యార్థితో బాలికకు పరిచయం ఉంది. అతడు మాయ మాటలతో బాలికను లోబర్చుకున్నాడు. అతని మాటలను నమ్మిన బాలిక..అతనితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. అదే అదునుగా చేసుకొని బాలుడు వీడియోలు, ఫోటోలు తీసి వాటిని అడ్డుగా పెట్టుకొని బాలికను బెదిరించటం స్టార్ట్ చేశాడు. అతడు చెప్పిన చోటుకి రాకపోతే వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాలికను హెచ్చరించాడు.  దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక.. అతడు చెప్పిన స్థలానికి వెళ్లింది. దాంతో అతని మిత్రులైన మరో నలుగురితో కలిసి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.”

ఇటీవలే బాలిక పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు.. సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దాంతో మే 30న ఖర్ఖానా పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మైనర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న బాలురు ఎల్బీనగర్‌ ప్రాంతాలకు చెందిన ఇద్దరుగా, మరో ముగ్గురు యువకులు వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.