మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాహుల్ సింగ్ లోధి ఆదివారం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అనంతరం ఆయన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో బీజీపీలో చేరారు. ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుమిత్రా దేవి, నారాయణ్ పటేల్, ప్రద్యం సింగ్ లోధి తదితరులు కూడా పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వారి బాటలోనే ఇప్పుడు రాహుల్ సింగ్ ప్రయాణించారు. దామో నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ రామేశ్వర్ శర్మకు అందజేశారు. ఎమ్మెల్యే రాహుల్ సింగ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్తో నా ప్రయాణం 14 నెలలు కొనసాగింది. అయితే అభివృద్ధి కోసం పని చేయలేకపోయాను. నా నియోజకవర్గంలో అన్ని ప్రజా సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. కాంగ్రెస్ను వీడి నేను బీజేపీలోకి నా ఇష్టపూర్వకంగానే వెళ్లాను’ అని స్పష్టంచేశారు.
మరోపక్క సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. రాహుల్ బీజేపీలో చేరిక నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీ నేతలకు ఆశలు నశిస్తున్నాయని అన్నారు. అభివృధి కోసం పని చేయాలనుకునేవాళ్లు ఆ పార్టీని వీడుతున్నారని తెలిపారు. కాగా, రాహుల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 87కి పడిపోయింది. మధ్యప్రదేశ్లో 28 స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.