కరోనా కరువును క్రికెట్ బెట్టింగ్‌ల రూపేణా తీర్చుకుందామని భావిస్తున్నట్టున్నారు కొందరు. కరువు సీజన్లో ప్రారంభం అయిన ఐపీఎల్ మీద వేలు, లక్షల్లో బెట్లు కాస్తూ చక్కగా పోలీసులకు చిక్కుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా బెట్టింగులు బాగా ఎక్కువ అయ్యాయి. కొన్ని యాప్స్‌లో బెట్టింగులకు పాల్పడి లక్షలు దండుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సమీపంలో బోయిన సందీప్ మరో ఏడుగురుతో కలిసి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు.
అదుపులోకి తీసుకున్న ఎనిమిది మంది వద్ద నుంచి రూ .15000 నగదు, ఎనిమిది మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరో పదిమంది పరారీలో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్‌కు సంబంధించి రూ.3,58,000 నగదు ఆఫ్‌లైన్, ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా లావాదేవీలు జరిపారని పోలీసుల విచారణలో తేల్చారు. నిందుతులను ఖమ్మం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, గత నెలలోనే ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీకి చెందిన బెట్టింగ్ ముఠాని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుగళ అక్షయ లింగం ఆధ్వర్యంలో షేక్ ఆరిఫ్, జెల్లా అఖిల్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురూ ఐపీఎల్ బెట్టింగ్‌ను తమ ఫోన్‌పే, గూగుల్ పే ఖాతాల ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లో బెట్టింగ్ కాశారు. 12 మందితో రూ.2,10,51 లావాదేవీలు నిర్వహించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముగ్గురుని పట్టుకున్నారు.