Another decision of AP Sarkar..Common policy in appointments
mictv telugu

ఏపీ సర్కార్ మరో నిర్ణయం..నియామకాల్లో ఉమ్మడి విధానం

August 8, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసకుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య విభాగాన్ని బలోపేతం చేయటానికి భారీ సంఖ్యలో పోస్టుల భర్తీని చేపట్టడానికి సిద్దమైంది. బయో మెడికల్‌ ఇంజినీర్, డైటీషియన్‌‌తోపాటు 42 విభాగాల్లోని 2,572 పారామెడికల్‌ పోస్టులను ఈ నెలలోనే భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో 466 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో 806 పోస్టులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో 1,300 పోస్టులు ఉన్నాయి. అయితే, ఈసారి అన్ని విభాగాల పోస్టులకు ఉమ్మడిగా నియామకాలు చేపట్టడానికి జగన్ సర్కార్ చర్యలు షురూ చేసింది.

అంతేకాదు, ఈ ఉమ్మడిగా నియామక ప్రక్రియకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఆయా జిల్లాలోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్‌ జారీ చేసి ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలో అభ్యర్థులు అన్ని విభాగాల నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా ఈసారి ఉమ్మడిగా నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. గతంలో టీచింగ్‌ మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు, వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్యం–కుటుంబ సంక్షేమ విభాగాలు ఖాళీలను వేర్వేరుగా భర్తీ చేసుకునేవి. దీనివల్ల అభ్యర్థులు వేర్వేరుగా దరఖాస్తు చేయడానికి ఇబ్బందులు పడేవారు. ఇకపై అలాంటి ఇబ్బందులను తొలగించేందుకు తొలిసారిగా మూడు విభాగాలకు ఉమ్మడి నోటిఫికేషన్‌ ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

ఇక, ఎంపిక విషయానికొస్తే.. అభ్యర్థుల మెరిట్‌ లిస్టును ఏడాదిపాటు పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుత పోస్టుల భర్తీలో అవకాశం దక్కని వారికి, మెరిట్‌ ఆధారంగా తదుపరి నియామకాల్లో అవకాశం కల్పిస్తారు. కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వారికి నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించారు.