Home > Featured > కేసీఆర్ సర్కార్‌ మరో నిర్ణయం..అభ్యంతరాలకు 21 రోజుల గడువు

కేసీఆర్ సర్కార్‌ మరో నిర్ణయం..అభ్యంతరాలకు 21 రోజుల గడువు

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి, ఆందోల్‌-జోగిపేట, చౌటుప్పల్‌ ఆర్డీవో పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో రీజినల్‌ రింగ్‌రోడ్డును వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో భూసేకరణకు వీలుగా గెజిట్‌ నోటిఫికేషన్లను కేంద్ర జాతీయ రహదారుల శాఖ జారీ చేసింది. ఇక, ఒక్క తూప్రాన్‌ ఆర్డీవో పరిధిలోని భూసేకరణకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది.

ఈ క్రమంలో సంగారెడ్డి, భువనగిరి, గజ్వేల్, నర్సాపూర్‌ ఆర్డీవోల పరిధిలో.. భూసేకరణ గెజిట్‌ ప్రచురితమైన రోజు నుంచి 21 రోజులలోపు ప్రజలు, ఇతరులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఓ ప్రకటన విడుదల చేశారు. "ఆయా ప్రాంతాల వారు..రోడ్డు నిర్మాణం వల్ల నష్టాలు, చేయాల్సిన మార్పు చేర్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల వారీగా భూసేకరణపై అభ్యంతరాలు, సూచనలను కాంపిటెంట్‌ అథారిటీకి అందించవచ్చు. ఏవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే, అధికారులు వాటిని పరిశీలించి, సభ నిర్వహించి ఆయా అభ్యంతరాలపై సమాధానాన్ని వెల్లడిస్తారు. జాతీయ రహదారుల చట్టం 1956(48) సెక్షన్‌ 3సిలోని సబ్‌ సెక్షన్‌ 1 ప్రకారం..అభ్యంతరాలపై కాంపిటెంట్‌ అథారిటీ ఇచ్చిన ఆదేశమే తుది నిర్ణయం అవుతుంది. కావున ఆయా గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 21 రోజులలోపు మీ అభ్యంతరాలను తెలియజేయండి"అని ప్రకటనలో పేర్కొన్నారు.

మరోపక్క రీజినల్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంటుకు సంబంధించి, అధికారులు ఇప్పటికే మార్కింగ్‌ చేశారు. గెజిట్లు విడుదలైన సందర్భంగా రోడ్డు వెడల్పు 100 మీటర్లు కచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందనేది గుర్తించి, హద్దు రాళ్లు పాతనున్నారు. డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం పరికరాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. అభ్యంతరాలపై సమాధానం వెల్లడించిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరించనున్నారు, దాని యజమాని ఎవరనే వివరాలతో త్వరలో 3డి గెజిట్‌ నోటిఫకేషన్‌ను విడుదల చేయనున్నారు.

Updated : 26 Aug 2022 1:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top