ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య మరో వివాదం నెలకొంది. సంగమేశ్వర క్షేత్రానికి బోటులు నడిపే విషయంలో ఇరు రాష్ట్రాలకు పడవ నిర్వాహకులు ఘర్షణకు దిగారు. దీంతో నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణానది మధ్యలోనే ఇరువర్గాలు కొట్లాటకు సిద్ధమయ్యారు. చివరికి కథ పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఎవరినీ పడవలు నడపకుండా పోలీసులు ఆదేశాలు జారీచేశారు.
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం సంగమేశ్వర ఆలయం. ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా 7 నదులు కలిసే ప్రదేశం ఇది. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం ఉంటుంది. దీంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. నది మద్యలో ఉండడంతో పడవలపై ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణకు చెందిన వారు పడవలను గత కొంతకాలంగా నడుపుతున్నారు. రెండు వారాలుగా వారి మధ్య వివాదాలు తలెత్తాయి. తెలంగాణకు చెందిన బోట్లను సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకే నడపాలని ఏపీ బోటు నిర్వాహకులు చెప్పారు. దీంతో ఇరవురి మధ్య వివాదం తలెత్తింది.కృష్ణ నదిలో ఇరువర్గాలు గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ఈ వివాదం సద్దుమనిగే వరకు ఎవరూ పడవలు నడపొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఈ అంశంపై పలవురు ఆత్మకూరు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సంగేశ్వర ట్రిప్‌లకు బ్రేక్ పడింది.