తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. ప్రభుత్వ కొలువును సాధించాలని కోటీ ఆశలతో రాత్రిపగలు కష్టపడి చదువుతున్న గ్రూప్-1, గ్రూప్ 2 అభ్యర్థులకు తీపికబురు చెప్పింది. గ్రూప్-1, గ్రూప్ 2తోపాటు ఇతర గెజిటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలోని ఇంటర్వ్యూ రౌండ్లను రద్దు చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు టీఎస్పీఎస్సీ ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితో పాటు, ఏడుగురు సభ్యులు ఇంటర్వ్యూల రద్దు ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఇంటర్వ్యూల ఎత్తివేతకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. దీంతో రాత పరీక్ష ఫలితాల ఆధారంగానే ఆయా ఉద్యోగాల భర్తీ జరగడం దాదాపుగా ఖాయమైంది. కాగా, ఇంటర్వ్యూల నిర్వహణ వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా అభ్యర్థులు కూడా ఇంటర్వ్యూ విధానంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం ఇంటర్వ్యూల రద్దు అంశాన్ని తెర మీదకు తెచ్చింది. రద్దు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఇటీవలే టీఎస్పీఎస్సీని కోరిన విషయం తెలిసిందే.