తెలంగాణలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో కలసి రూ. 6 కోట్లతో యూత్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా విప్రో సంస్థ తన కంపెనీకి చెందిన సంతూర్ సబ్బుల తయారీ యూనిట్‌ను రూ.300 కోట్లతో హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో ఏర్పాటు చేసింది. ఆ యూనిట్‌ను విప్రో ఫౌండర్ చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీతో కలిసి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వంతో హిందూస్థాన్ కోకకోల సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలంటూ హిందూస్థాన్ బేవరేజెస్‌ని కేటీఆర్ కోరారు.
కేటీఆర్ మాట్లాడుతూ… ”హిందూస్థాన్ కోకకోల బేవరేజేస్ కంపెనీతో ఎంవోయూ కుదరటం చాలా సంతోషం. సిద్ధిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్ దగ్గరున్న ఫుడ్ పార్క్‌లో ఈ ప్లాంటు నిర్మాణం జరుగుతుంది. మొదటి దశలో రూ. 600 కోట్లతో ప్లాంట్ నిర్మాణం చేపట్టి, రెండో దశలో రూ. 400 కోట్లతో ప్లాంట్‌ను విస్తరిస్తారు. ఈ ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తారు. జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలి” అని హెచ్‌సీసీబీ ప్రతినిధులకు కేటీఆర్ సూచించారు.
మరోపక్క ఇండియాలో ఉన్న ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో హిందూస్థాన్ బేవరేజ్ సంస్థ ఒకటి. మాన్యుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. మినిట్ మైడ్, స్ప్రైట్, మోన్స్టర్, థమ్సప్, లిమ్కా వంటి ప్రముఖ బ్రాండు ఈ సంస్థకు చెందినవిగా ఉన్నాయి. ఇటువంటి ప్రముఖ కంపెనీ తెలంగాణలో ఏర్పాటు కావడంతో సిద్ధిపేట జిల్లా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.