ఏపీలో మరో మాస్కు రగడ.. యువతి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో మరో మాస్కు రగడ.. యువతి మృతి

July 12, 2020

Guntur

‘కరోనా సమయం కదా.. ముఖానికి మాస్కు పెట్టుకోండి, కాస్త దూరంగా ఉండి భౌతిక దూరం పాటించండి’ అని అవతలి వాళ్లకు చెబితే కొందరు అర్థం చేసుకుంటున్నారు. కానీ, కొందరు గడ్లు ఉరిమి చూస్తున్నారు. వారికి చెప్పకుండా ఉందామంటే కరోనా చెలరేగిపోతుందనే భయం. అందుకని చెప్పడాన్ని కొందరు బాధ్యతగా భావిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 27న నెల్లూరు పర్యాటక శాఖ కార్యాలయంలో ముఖానికి మాస్కు ధరించాలని సలహా ఇచ్చినందుకు.. ఓ అధికారి దివ్యాంగురాలైన మహిళా సహోద్యోగినిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని  పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ ఘటన గురించి మరిచిపోక ముందే ఏపీలో అలాంటిదే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 

ఈ ఘటన జూలై 3న గుంటూరు జిల్లా రెంటచింతలలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతలకు చెందిన కర్ణాటి యలమంద మాస్కు లేకుండా వీధుల్లో తిరుగుతుండగా కొందరు యువకులు మాస్కు పెట్టుకోవాలని చెప్పారు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. అయితే కొద్దిరోజుల తర్వాత సదరు యువకులు ముఖానికి మాస్కులు లేకుండా మార్కెట్‌లో తిరుగుతున్నారు. వారిని యలమంద బంధువులు గుర్తించారు. వెంటనే వారిని అడ్డగించి, అభ్యంతరం తెలిపారు. దీంతో వారి మధ్య మళ్లీ వాదన చోటు చేసుకుని, ఇరుపక్షాల మధ్య ఘర్షణకు దారితీసింది. యువకులు ఎలమందపై కర్రలతో దాడి చేసేందుకు రాగా, అతడి కూతురు కర్ణాటి ఫాతిమా అడ్డుగా వచ్చింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను గుంటూరు జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నలుగురు యువకులపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.