మరో మహమ్మారి ముప్పు తప్పదు: బిల్‌ గేట్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో మహమ్మారి ముప్పు తప్పదు: బిల్‌ గేట్స్

February 21, 2022

 

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటుంది. అంతేకాకుండా మహమ్మారి కారణంగా నష్టపోయిన సంస్ధలు, వ్యాపారాలు ఇప్పుడిప్పుడే లాభాల బాట పట్టాయి. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచాన్ని హెచ్చరించారు. భవిష్యత్తులో మరో మహమ్మారి ముప్పు తప్పదని, రాబోయే మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశముందని అన్నారు. కానీ, ఇది కరోనా వైరస్‌ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి వచ్చే అవకాశముందని తెలిపారు.

ఇటీవలే ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ..‘‘గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచ జనాభాపై పెను ప్రభావం చూపించింది. అయితే, ఇటీవల వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలా మందిలో రోగనిరోధక స్థాయిలు పెరగడంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తట్టుకోగలిగాం. అయితే, కొవిడ్‌ తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది బహుశా కరోనా కుటుంబం నుంచి గాక, వేరే వైరస్‌ నుంచి కావొచ్చు. వృద్ధులు, ఊబకాయం, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. 2022 మధ్య నాటికి 70 శాతం ప్రపంచ జనాభాకు వ్యాక్సిన్లు అందజేయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు అని అన్నారు.