మత్తులో చేస్తున్నారో, మతి తప్పి చేస్తున్నారో లేదంటే కన్నుమిన్ను కానక చేస్తున్నారో కానీ ఇటీవల ప్రయాణికులపై మూత్ర విసర్జన సంఘటనలు అధికమయ్యాయి. ఇప్పటివరకూ విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా రైల్లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలిపై ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు ఓ రైల్వే టీటీఈ. ఈ దారుణ ఘటన అమృత్సర్ నుంచి కోల్కతా వెళ్తున్న అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
బిహార్‌కు చెందిన రాజేష్ కుమార్ దంపతులు అకల్‌తఖ్త్ రైలులో ప్రయాణిస్తున్నారు. వీరు బిహార్‌లోని కియుల్ ప్రాంతం నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళ్తున్నారు. అప్పుడు మద్యం మత్తులో ఉన్న టీటీఈ మున్నా కుమార్.. రాజేశ్ కుమార్ భార్యపై మూత్రం పోశాడు. దీంతో అతడిని తోటి ప్రయాణికులు, బాధితురాలి భర్త కలిసి లఖ్‌నవూలోని చార్‌బాగ్ రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందితుడు మున్నా కుమార్.. స్వస్థలం బిహారే కావడం గమనార్హం. మహిళ, ఆమె భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలపై అరెస్టైన టీటీఈని రెల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశాల మేరకు అధికారులు విధుల నుంచి తొలగించారు. బాధ్యత గల రైల్వే ఉద్యోగంలో ఉండి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. మూత్ర విసర్జన చర్య వల్ల నిందితుడితో పాటు రైల్వే శాఖ మొత్తానికి అపఖ్యాతి వచ్చిందన్నారు.