తాత్కాలిక డ్రైవర్లు చంపేస్తున్నారు, శిక్షణ ఇప్పించండి.. - MicTv.in - Telugu News
mictv telugu

తాత్కాలిక డ్రైవర్లు చంపేస్తున్నారు, శిక్షణ ఇప్పించండి..

November 25, 2019

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకి చేరింది. విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం వారిని పిలవడం లేదు. ఇదిలా ఉంటే ఆర్టీసీ వ్యవహారంలో దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా అర్హత, అనుభవం లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారంటూ న్యాయవాది గోపాలకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 80 రోజులు శిక్షణ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

court about rtc issue.

అలాగే సెప్టెంబర్‌ నెల జీతాలు ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు కొంత గడువు కావాలని ఆర్టీసీ తరపు న్యాయవాది కోరాడు. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు సమయం తీసుకున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి గడువు కోరవద్దని హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఈరోజు సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైతో రాజ్ భవన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆర్టీసీ అంశంపై సుదీర్ఘ చెర్చ జరుగనుందని సమాచారం.