తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)లో మరో భారీ అక్రమం వెలుగు చూసింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నపత్రాలు మాత్రమే కాకుండా అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం కూడా లీకైంది. ఈ పరీక్షను మార్చి 5నే నిర్వహించారు.
టెస్టుకు రెండు రోజుల ముందే ఇది లీకైంది. ఈ కేసులో ముగ్గురు అభ్యర్థులతోపాటు మొత్తం 9 మంది అరెస్టయ్యారు. నిందితుల్లో టీఎస్ పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్, లీకేజీ సూత్రధారి రేణుక, ఆమె భర్త, సోదరుడు ఉన్నారు. లీకేజీ నేపథ్యంలో ఏఈ పరీక్ష రద్దయ్యే అవకాశం ఉంది.
కొంతమంది చేసిన అవినీతి ఫలితంగా మొత్తం అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ క్వశ్చన్ పేపర్ లీకైందని ఈ 11న పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన పోలీసులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ హస్తం ఉందని తేల్చారు. అతడు తన పెన్ డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలను కాపీ చేసుకుని రేణుక ద్వారా అభ్యర్థులకు పంపి, వారి నుంచి 13.5 లక్షలు తీసుకున్నాడు.
కార్యదర్శి పీఏ కావడంతో ప్రవీణ్ కంప్యూటర్ల పాస్ వర్డులను తెలుసుకుని అక్రమాలనికి తెరతీశాడని పోలీసులు చెప్పారు. ఏఈ టెస్ట్ పేపర్ వాస్తవానికి మరింత మందికి లీక్ అయ్యుంటే అవకాశముందని, లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.