తెలంగాణ ప్రజలకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే, పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ వంటి ధరలు పెరుగగా, ఇప్పుడు ఆర్టీసీ వంతు వచ్చింది. టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 రేట్లు పెరిగాయి. ఈ ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. కాగా, ఇటీవలే చిల్లర సమస్యతో రౌండప్ విధానాన్ని తీసుకొచ్చింది. పల్లెవెలుగు బస్సులకు దీనిని వర్తింపజేసింది. ఇంతేకాక, హైదరాబాదులో బస్సుపాసుల ధరలు కూడా పెరిగాయి. తాజాగా ఛార్జీల పెంపుతో ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సడెన్గా రేట్లు పెంచడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగి ఇంటి బడ్జెట్ మీద ప్రభావం చూపుతోంది. ఇప్పుడు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ ధరలు పెంచడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.