ఢిల్లీలో శ్రద్ధావాకర్ లాంటి మరో దారుణ ఉదంతం చోటుచేసుకుంది. ఓ ప్రియుడు తన ప్రియురాలిని హత్యచేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. ఢిల్లీ శివారు నజఫ్‌గఢ్ దగ్గర్లోని మిత్రో గ్రామంలోని ఓ దాబాలో శవం ఫ్రిజ్ బయటపడింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాహిల్ గెహ్లాట్(24) అనే యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలిని 23 ఏళ్ల నిక్కీ యాదవ్ గా గుర్తించారు.
సాహిల్.. నిక్కీని ఈ నెల 10న మెడకు డేటా కేబుల్ బిగించి చంపేశాడు. తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తన కుటుంబం నడిపే డాబాలో ఉంచాడు. చంపేసిన రోజే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. సాహిల్ ఫార్మా గ్రాడ్యుయేట్ అని పోలీసులు చెప్పారు. నిక్కీ నాలుగు రోజులుగా కనిపించడం లేదని హరియాణాకు చెందిన ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిఘాపెట్టి హంతకుణ్ని పట్టుకున్నారు. నిక్కీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుండగా అతనితో పరిచయం ఏర్పడింది. నోయిడాలో కొన్నేళ్లుగా కలసి ఉంటున్నారు. ఈ నెల 10న సాహిల్ తల్లిదండ్రులు అతనికి మరో యువతితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనిపై నిక్కీ.. సాహిల్‌తో గొడవ పడింది. సాహిల్ ఆమెను కారులో ఉంచిన మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌ను మెడకు చుట్టి చంపేశాడు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న ధాబాలోని ఫ్రిడ్జ్‌లో మృతదేహం ఉందని తెలియడంతో పోలీసులు సాహిల్‌ను అరెస్ట్ చేశారు. తన కూతుర్ని చంపిన దుర్మార్గుడికి మరణ శిక్ష విధించాలని నిక్కీ తండ్రి డిమాండ్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని అఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు ఘోరంగా చంపి 32 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టడం తెలిసిందే.