టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. కందుకూరులో ఎనిమిది మంది చనిపోయిన విషయం మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు చనిపోయారు. పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వికాస్నగర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబు హాజరయ్యారు. సభ అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని ప్రచారం చేయడంతో భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన తర్వాత చంద్రన్న కానుకలు పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ సమయంలో మహిళలు ఒక్కసారిగా ఎగబడడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రణాళిక లేకుండా చంద్రన్న కానుకలు అందించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజుల వ్యవధిలోనే మరోసారి తొక్కిసలాట జరిగి ప్రజలు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఇదేం కర్మరా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలి వచ్చారు. వెనుక ఉన్నవారు ముందుకు రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరగింది. ఈ క్రమంలో గుండంకట్ట ఔట్లెట్లో కార్యకర్తలు జారిపడిపోయి ఎనిమింది మంది మృతి చెందారు. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబ సభ్యలకు టీడీపీ తరఫున 24 లక్షలు ఆర్థిక సాయం అందించారు.