Another stone attack on the Vande Bharat train
mictv telugu

మరోసారి వందేభారత్ ట్రైన్‌పై దాడి

February 11, 2023

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లదాడి పరిపాటిగా మారింది. కావాలని చేస్తున్నారో లేదా ఆకర్షణీయంగా కనిపించేసారికి రాళ్లు విసురుతున్నారో తెలీదు కానీ వందే భారత్ ట్రైన్ కనిపిస్తే చాలు కొంతమంది ఆకతాయిలు చేతులకు పనిచెప్తున్నారు. గత నెలలో ప్రారంభమైన సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్ ట్రైన్‌పై మరోసారి దాడి జరిగింది. రైలు ప్రారంభానికి ముందే విశాఖ కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరగ్గా..కొన్ని రోజుల కిందట ఖమ్మం జిల్లాలో వందేభారత్ పై రాళ్లు విసిరారు.

తాజాగా మహబూబాబాద్-గార్ల స్టేషన్ల మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్‎ను ఓ వ్యక్తి రాయితో కొట్టాడు. దాంతో C-8 కోచ్‌ అద్దం ధ్వంసమైంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లపై దాడులు జరుగుతున్నాయి.మరోవైపు దేశంలో రైళ్ళ సంఖ్యను క్రమంగా పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం. నిన్న ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య రెండు రైళ్లను ప్రధాని మోడీ ప్రారంభించారు.దీంతో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 10కి చేరింది.