ఖమ్మంలో ఘోరం... టీచర్‌పై మరో టీచర్ అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

ఖమ్మంలో ఘోరం… టీచర్‌పై మరో టీచర్ అత్యాచారం

March 24, 2022

04

లిఫ్ట్ ఇస్తానంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని నమ్మించి అత్యాచారం చేశాడు మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయ లోకం తలదించుకొనేట్టు చేసిన ఈ సంఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివసించే ఉపాధ్యాయుడు మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలంలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన భార్య కూడా టీచర్ కావడంతో ఇద్దరూ కలిసి కారులో విధులకు వెళ్లి వచ్చేవారు. మరో ఉపాధ్యాయురాలు రైలులో డోర్నకల్ వరకు వచ్చి, తర్వాత ద్విచక్రవాహనంపై పాఠశాలకు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 17న విధులు ముగించుకొని రైల్వే స్టేషన్‌లో వేచి చూస్తున్న ఉపాధ్యాయురాలిని చూసిన సదరు ఉపాధ్యాయుడు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మబలికి కారులో ఎక్కించుకున్నాడు. మీ భార్య ఏది అని అడిగితే ముందు స్టేజీలో ఉందని బుకాయించాడు. ఇంతకు ముందు భార్యాభర్తలిద్దరితో కలిసి రెండు మూడు సార్లు కారులో ప్రయాణం చేసి ఉండడంతో బాధితురాలికి ఎలాంటి అనుమానం కలగలేదు. ఇదే అదనుగా భావించిన నిందితుడు కొంత దూరం వెళ్లాక బాధితురాలిని బెదిరించి ఫోన్ లాక్కున్నాడు. దారిలో ఉన్న పాండురంగాపురం గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఎవరికైనా చెబితే భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. నిందితుడు ఉపాధ్యాయ సంఘంలో ప్రముఖ నేత కూడా కావడంతో బెదిరిపోయిన బాధితురాలు కొన్ని రోజులు మిన్నకుండిపోయింది. కానీ, జరిగిన అన్యాయాన్ని తలచుకొని ధైర్యం చేసి భర్తకు చెప్పింది. అనంతరం ఇద్దరూ కలిసి ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.