చైనాలో మరో వైరస్.. ఒకరి మృతి, లక్షణాలు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో మరో వైరస్.. ఒకరి మృతి, లక్షణాలు ఇవే.. 

March 24, 2020

rabbat

కరోనా బీభత్సం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న చైనాలో మరో వైరస్ వెలుగు చూసింది. ‘హంటావైరస్’ బారిన పడి 39 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. అతనితోపాటు బస్సులో ప్రయాణించిన 32 మందిని అధికారులు ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షించారు. అయితే వారికి ఆ వ్యాధి సోకిందో లేదో తెలియడం లేదు. యానాన్ రాష్ట్రం నుంచి షాండాంగ్ రాష్ట్రానికి తిరిగి వస్తున్న వ్యక్తి సోమవారం బస్సులో కన్నుమూశాడు. ఎలుకల ద్వారా వ్యాపించే హంటా వైరస్‌తో అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 1959లో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్‌కు మందులు ఉన్నాయని, నాలుగేళ్ల నుంచి టీకా అందుబాటులో ఉందని చెప్పారు. కరోనాను తొలుత నిర్లక్ష్యం చేయడంతో ఆ వ్యాధి పెచ్చరిల్లడంతో హంటావైరస్‌ వ్యాప్తిని ఆదిలోనే అరికట్టేందుకు వైద్యులు యత్నిస్తున్నారు. 

వ్యాధి లక్షణాలు ఇవే.. 

ఇది కూడా కరోనా వైరస్ మాదిరే శ్వాసకోశాలను దెబ్బతీస్తుంది. కిడ్నీల్లో సమస్యలు తలెత్తుతాయి. నాడీమండలం దెబ్బతింటుంది. కానీ గాలిద్వారా ఈ వ్యాధి వ్యాపించదు. మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. ఎలుకల మూత్రం, మలం, లాలాజలం ద్వారా సోకుతంది. అవి కొరికినా వస్తుంది.  కానీ వాటికి ఈ వ్యాధి సోకదు. ఈ వైరస్‌లో హంటావైరస్ పల్మనర సిండ్రోమ్(హెచ్‌పీఎస్), హేమరేజిక్ ఫీవర్ విత్ రెనల్ సిండ్రోమ్(హెచ్‌ఎఫ్ఆర్ఎస్) అనే రెండు రకాలు ఉన్నాయి. 

హెచ్‌పీఎస్‌లో మొదట అలసట, జ్వరం, కండాల నొప్పి మొదలవుతాయి. తలనొప్పి, మగత, వణుకు, వొళ్లు నొప్పులు, కడుపు గడబిడగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే దగ్గు, ఆయాసం ప్రారంభమవుతాయి. వ్యాధి సోకినవారిలో సరైన చికిత్స తీసుకోకపోతే  38 శాతం మంది మరణించే అవకాశముంది. 

హెచ్‌ఎఫ్ఆర్ఎస్‌లో వైరస్ సోకిన ఒకటి నుంచి రెండు వారాల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు 8 వారాలు కూడా పట్టొచ్చు. తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, కడుపునొప్పి, జ్వరం, దృష్టి లోపం, తక్కువ రక్తపోటు, మూత్రపిండాల వైఫల్యం ఉంటాయి.