Another welfare scheme in AP .. Jagan guaranteed in the cabinet
mictv telugu

ఏపీలో మరో సంక్షేమ పథకం.. కేబినెట్‌లో జగన్ హామీ

June 25, 2022

ఇప్పటికే నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో అమలుపరుస్తున్న ఏపీ ప్రభుత్వం.. త్వరలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. యువతుల వివాహానికి నగదు సహాయం అందజేసే ఆ పథకం గతంలో చంద్రబాబు హయాంలో ఉన్నా, వైసీపీ వచ్చాక అటకెక్కింది. దుల్హన్ పేరుతో అమలైన ఆ పథకాన్ని నిధులు లేక రద్దు చేసినట్టు ఇటీవల ప్రభుత్వం కోర్టులో చెప్పడం తెలిసిందే. దీంతో రాజీకయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన నూతన మంత్రులు ఇటీవల నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దానికి సీఎం జగన్.. ‘గత ప్రభుత్వం చాలా మంది లబ్దిదారులను పెండింగులో పెట్టింది. వాటిని తీర్చాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలి. వాటిని తీర్చి కొత్తగా ప్రారంభించాలంటే కూడా చాలా డబ్బు అవసరమవుతుంది. పథకానికి అవసరమైన నిధుల అంచనాలు సిద్ధమయ్యాక మంచి రోజు చూసుకొని ప్రారంభిద్దాం’ అని చెప్పినట్టు సమాచారం. కాగా, ఇంతకుముందు వైసీపీ కూడా పెళ్లి కానుక పేరుతో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు దుల్హన్ పథకం కింద రూ. 50 వేలు ఇవ్వగా, జగన్ దానిని రూ. లక్షకు పెంచారు. అయితే ఈ పథకం కార్యరూపం దాల్చలేదు.