అగ్రవర్ణాల బంద్‌లో హింస.. కోటాపై కన్నెర్ర - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రవర్ణాల బంద్‌లో హింస.. కోటాపై కన్నెర్ర

April 10, 2018

కుల ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల సంఘాలు, అగ్రవర్ణ భావజాల పార్టీలు, అనుబంధ సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. కోటా వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 2న దళితసంఘాలు భారత్ బంద్ చేపట్టడం తెలిసిందే. దీనికి ప్రతిగా అగ్రవర్ణాలు మంగళవారం రోడ్లపైకొచ్చాయి.

ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో అగ్రవర్ణాల యువత బంద్ నిర్వహిస్తోంది. పలు చోట్ల బలవంతంగా దుకాణలను మూయించి, రైళ్లను అడ్డుకున్నారు. బిహార్‌లో జరిగిన ఘర్షణల్లో 15మందికిపైగా గాయపడ్డారు. భోజ్‌పుర్, బెగసారై, లఖిసారై, ముజఫర్‌పుర్, షేక్‌పుర, దర్బంగా తదితర ప్రాంతాల్లో అగ్రవర్ణాలకు, దళిత-ఓబీసీ యువతకు మధ్య భౌతిక దాడులు జరిగాయి. కొనని చోట్ల కాల్పులు కూడా జరిగాయి.  హింస జరిగే అవకాశముందని, భద్రతను పెంచాలని కేంద్రం నిన్ననే రాష్ట్రాలను హెచ్చరించింది. అయినా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 2న భారత్‌ బంద్‌ నిరసనల్లో పోలీసులు, అగ్రవర్ణాల యువకులు జరిపిన కాల్పల్లో 10 మంది దళితులు చనిపోవడం తెలిసిందే.

సుప్రీం కోర్టు తీర్పు వల్లే

ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతోందంటూ, దాన్ని నీరుగార్చేలా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో చిచ్చుపెడుతోందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో ఫెరా వంటి తీవ్రమైన చట్టాలే దుర్వినియోగం అవుతున్నాయి, ఎస్సీ, ఎస్టీ చట్టం విషయంలో అలాంటిది జరిగే బాధ్యులపై చర్య తీసుకోవాలేగాని, ఏకంగా చట్టాన్ని బలహీనం చేయడం సరికాదని అంటున్నాయి.