భారత ‘నాగ్’ అస్త్రం సక్సెస్..  - MicTv.in - Telugu News
mictv telugu

భారత ‘నాగ్’ అస్త్రం సక్సెస్.. 

October 22, 2020

 Pokhran range

భారత్ నాగ్ అస్త్రం సూపర్ సక్సెస్ అయింది. లక్ష్యం గురి తప్పకుండా రివ్వున దూసుకెళ్లింది. ప్రయోగాల ఊపు పెంచిన డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ఇటీవల ఆయుధ ప్రయోగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వరుసగా కీలక ఆయుధాల సన్నద్ధతను పరీక్షిస్తోంది. తాజాగా ఈరోజు టాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ను పరీక్షించి విజయవంతమైంది. ఆకాశంలోకి వేగంగా దూసుకెళ్లిన నాగ్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో భారత సైన్యంలో చేరికకు పూర్తిగా సిద్ధమైంది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ యాంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్ (ఏటీజీఎమ్) లక్ష్యాన్ని ఛేదించడంతో డీఆర్టీఓ హర్షం వ్యక్తంచేసింది. ఈ ప్రయోగాన్ని రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజిలో నిర్వహించినట్టు వెల్లడించింది. నాగ్ యాంటీ ట్యాంక్ క్షిపణి 10 సార్లు నిర్వహించిన టెస్టులో నిర్దేశించిన టార్గెట్‌ను ఢీకొట్టినట్లు డీఆర్‌డీఓ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. దీంతో ఇక రక్షణశాఖలో ఈ అస్త్రం చేరేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 

ఇక డీఆర్‌డీఓ 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించేలా రూపొందించిన సబ్ సానిక్ క్రూజర్ నిర్భయ్ ఈ నెల మొదట్లో ప్రయోగం సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తిందని అధికారులు చెప్పారు. బూస్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించి మరమత్తులు చేసినట్లు చెప్పిన అధికారులు రానున్న నెలల్లో ఈ ప్రయోగాన్ని మరింత సక్సెస్ చేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఒకటిన్నర నెలల కాలంలోనే డీఆర్డీఓ 12 క్షిపణి ప్రయోగాలు చేసింది. ఇవాళ నిర్వహించిన నాగ్ యాంటీ టాంక్ మిస్సైల్ ప్రయోగం ఓ మొబైల్ లాంచర్ ద్వారా నిర్వహించారు. కాగా, 4 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని శత్రు టాంకులను నామరూపాల్లేకుండా చేయగల సత్తా కలది నాగ్ అస్త్రం. ఇది మూడవ తరం ఏటీజీఎమ్. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా లక్ష్యాలపై దూసుకెళ్తుంది.