Antiques to curating home museum
mictv telugu

ఇల్లే ఒక మ్యూజియం!

November 16, 2022

ఎలక్ట్రిక్, మైక్రోవేవ్లు వచ్చాక ఇత్తడి, రాగి పాత్రల వైపు చూసే వారే కరువయ్యారు. కానీ కొంతమంది ఇప్పటికీ వాటిని పుత్తడి కంటే ఎక్కకువగా చూసుకుంటూ దాచుకుంటున్నారు. అలా దాచుకొని ఇంటినే మ్యూజియం చేశాడో పెద్దాయన. ఆ ఇంటి గురించి, ఆయన గురించే ఈ కథనం.. సికింద్రాబాద్ లోతుకంట.. ఇంటినెం. 16/3. అందులో ఉండేది వై. కృష్ణమూర్తి. ఇంట్లో మనుషుల కంటే పురాతన వస్తువులే ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక కొత్త అనుభూతి పొందుతారు. అది ఇల్లు అనేకంటే ఒక మ్యూజియం అని చెప్పొచ్చు. అందుకే ఈ ఇంటికి వైకే యాంటిక్స్ అని పేరు పెట్టారు. పురాతన వస్తువుల సేకరణతో ఇల్లంతా నిండిపోయి ఉంటుంది. గంగాళం, చెంబు, తపాలా ఇలా ఒక్కటేమిటి మొత్తం మీద 900 రకాల పురాతన వస్తువులను ఇక్కడ మనం చూడొచ్చు. మన దేశంలోనివే కాదు.. విదేశాల్లోని వస్తువులు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. కాకపోతే ఈ ఇంట్లోకి అడుగుపెట్టాలంటే మాత్రం అపాయింట్మెంట్ ఉండాల్సిందే! అపాయింట్మెంట్ కోసం www.ykantiques.com ని క్లిక్ చేయండి.
అలా మొదలైంది..

www.ykantiques.com

వైకే యాంటిక్ మొదలుపెట్టడానికి ప్రేరణ వాళ్ల అమ్మే అంటారు కృష్ణమూర్తి. పుట్టి పెరిగింది కాకినాడ దగ్గర సోమేశ్వరంలో. చిన్నప్పటి నుంచి అమ్మ ఎంతో భద్రంగా దాచిన ఇత్తడి గిన్నెలను చూసి పెరిగాడు. పండుగలు వచ్చాయంటే వాటిని శుభ్రం చేయడం అమ్మ పని అయితే, వాటిని తుడిచి పెట్టడం కృష్ణమూర్తి గారి పని. అలా వాటితో ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఎంతలా అంటే.. తాను ఉద్యోగరీత్యా చెన్నై వెళ్లినా అమ్మ దగ్గర నుంచి కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టేంతగా! అయితే ఇంటికి వచ్చిన వారంతా ఆ వస్తువుల గురించి ఆరా తీయడంతో ఈ వస్తువుల సేకరణ పై మక్కువ ఏర్పడింది. అలా వస్తువుల సేకరణ చేయడంలో మరింత ఆసక్తి పెరుగడంతో కార్పొరేట్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి ఒక ఇంటిని ఈ వస్తువులను ఉంచడానికి హైదరాబాద్ వచ్చేలా చేశాయి. ఇక్కడకి వచ్చాక ఒక కన్సల్టెన్సీ పెట్టి యంగ్ టీమ్ని తీసుకున్నాడు. వాళ్లు సోషల్మీడియాలో వీటి గురించి చెబితే ఆదరణ ఉందని చెప్పడంతో పలు సోషల్మీడియాల్లో వైకే యాంటిక్స్ గురించి పెట్టడం మొదలుపెట్టారు. స్కూల్ పిల్లలు, విదేశాల్లో నుంచి కూడా ఈ వస్తువులను చూడడానికి వస్తుండడం విశేషం.

వంటల పుస్తకం..


అక్కచేతి వంట అనే పుస్తకం కూడా మూర్తి పబ్లిష్ చేశారు. ఆయన అక్క అయిన వక్కలంక సూర్యకాంతం గారి వంటకాలకు ఆయన అక్షర రూపం ఇచ్చారు. 70కి పైగా వంటకాలు ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఈ పుస్తకంలో పొడులు, పచ్చళ్లు.. ఒక్కటేమిటి కొత్తగా నేర్చుకొనే వాళ్లు ఎవరైనా ఈ పుస్తకం చేస్తే నలభీములైపోతారు. వంకాయ, మునగాకు, అరటితో కనీసం ఐదు రకాల వంటకాలను ఎలా చేయాలో వివరంగా ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకం కావాలనుకున్న వాళ్లు వెబ్సైట్లో చూడండి.