కణాల్లో క్యాన్సర్ ఉనికిని గుర్తించడానికి కుక్కలను ఉపయోగించడం అనేది ఒక ప్రసిద్ధ భావన. అయితే చీమలు కూడా అదే చేయగలవని కొత్త పరిశోధనలో తేలింది. చీమలు మూత్రం వాసనతో క్యాన్సర్‌ను గుర్తించగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారని వాషింగ్టన్ పోస్ట్ నివేధించింది. చీమలకు ముక్కలు లేవు కదా.. మరి వాసనని ఎలా పసిగట్టగలవనే సందేహం వచ్చే ఉంటుంది. అయితే వీటికి ఉండే యాంటెన్నా పై ఘ్రాణ గ్రాహకాలు వాసనను పసిగట్టగలవు. ముఖ్యంగా క్యాన్సర్‌గా ఉన్న కణితులు అస్థిర కర్బన సమ్మేళనాలు అని పిలువబడే రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి తరుచుగా చెమట, మూత్రం వంటి శారీరక ద్రవాల్లో కనిపిస్తాయి. చీమలు ఆ సమ్మేళనాలను మూత్రంలో పసిగట్టగలవు.
ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ బీ.. బయోలాజికల్ సైన్సెస్ అనే జర్నల్ లో ప్రచురించబడిన ఈ పరిశోధనల్లో రోగుల్లో క్యాన్సర్ గుర్తించడానికి ఈ కీటకాలను తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గంగా ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. అధ్యయనం కోసం.. పరిశోధనా బృందం ఎలుకలపై మానవ రొమ్ము క్యాన్సర్ కణితి ముక్కలను అంటుకట్టింది. వారు ఫార్మికా ఫుస్కా అని పిలువబడే జాతికి చెందిన 35 చీమలను కణితులతో కాకుండా కేవలం మూత్ర నమూనాలతో అధ్యయనం చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి మూత్రం ముందు ఒక చుక్క చక్కెర నీటిని ఉంచారు. దీనివల్ల వాటికి శిక్షణ ఇచ్చారు పరిశోధకులు. ఎలుకల కంటే కూడా చీమలు తొందరగా ఈ వాసనను పసిగట్టాయి. కుక్కలకు శిక్షణ ఇవ్వడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది. అదే చీమలకు 10 నిమిషాల్లో మూడు రౌండ్ల శిక్షణ ఇవ్వడంతోనే అవి పసిగట్టేశాయి. ఫ్రాన్స్ లోని పారిస్‌లోని సోర్బోన్ ప్యారిస్ నోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన రచయిత ప్రొఫెసర్ ప్యాటిజియా డి ఎట్టోర్ ప్రకారం.. ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే క్యాన్సర్ ఉన్న వ్యక్తులను గుర్తించడానికి చీమలను బయో డిటెక్టర్లుగా ఉపయోగించవచ్చని, వాటికి సులభంగా శిక్షణ ఇవ్వొచ్చని అన్నారు.