కోనసీమను అట్టుడికిస్తున్న అమలాపురం అల్లర్లు, విధ్వంసం వెనక అన్యం సాయి అనే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతనిపై రౌడీ షీట్ తెరిచి కూపీ లాగుతున్నారు. సాయిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో సాయి వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ ఎమ్మెల్య చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి మేకతోటి చరిత, వైసీపీ నేత ఒంటెద్దు వెంకటనాయుడు తదితరులతో సాయి తీయించుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. సాయి అధికార పార్టీకి చెందిన వాడేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త, మంత్రి విశ్వరూప్‌కు అనుచరుడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు విశ్వరూప్‌కు మంత్రి పదవి వచ్చిప్పుడు ఆయనను అభినందిస్తూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. అయితే ఇతడు జనసేన పంపిన కోవర్ట్ కావొచ్చని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సాయి అమలాపురం కలెక్టర్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.