హద్దులు దాటనంతవరకే టిక్‌టాక్ అయినా ఏదైనా.. దాటారో అంతే.. - MicTv.in - Telugu News
mictv telugu

హద్దులు దాటనంతవరకే టిక్‌టాక్ అయినా ఏదైనా.. దాటారో అంతే..

April 24, 2019

టిక్‌టాక్ బ్యాన్ చెయ్యడంతో చాలా మంది యూజర్లు బెంగ పెట్టుకుంటున్నారు. దాన్ని ఎత్తివేయొద్దంటూ గగ్గోలు పెడుతున్నారు. తమిళనాడులో బ్యాన్ అయిన ఈ యాప్‌పై నిషేధాన్ని ఎత్తివేసింది మద్రాస్ హైకోర్ట్. కొంతమంది యూజర్లు ఈ యాప్ వల్ల తమలోని కళను ప్రదర్శించారు. సరదాగా మనోల్లాసంగా వుండటానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతోందని అంటున్నారు. డబ్‌స్మాష్‌కు సంపూర్ణ రూపంగా వచ్చిందే ఈ టిక్‌టాక్ యాప్. స్మార్ట్‌ఫోన్ చేతిలో పట్టుకుని పాటలకు డాన్సులు, సినిమాల్లోని సన్నివేశాలకు హావాభావాలు ప్రకటించడం వంటివి ఈ యాప్‌లో చేస్తుంటారు.

Anything beyond the bounds istickTak ..That's it ...

తదనుగుణంగా లైకులు, కామెంట్లు, షేర్లతో కొందరు టిక్‌టాక్‌లో ఫేమస్ అవుతున్నారు. అయితే అంతవరకు బాగానే వున్నా అదికాస్త శృతి మించడంతో టిక్‌టాక్ నిషేధానికి దారి తీసింది. కొందరు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని, అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఇత్యాది కారణాలతో ఈ యాప్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వరుసగా ఒక్కో రాష్ట్రం బ్యాన్ చేయడం ప్రారంభించింది. నాకు నచ్చినట్టు నేనుంటా.. నాలో వున్న టాలెంటును నేను బయట పెట్టుకుంటానని అంటున్నారు. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించేలా వుండటంతో టిక్‌టాక్ బ్యాన్‌కు దారితీసింది.

సోషల్ మీడియా వేదికగా ఏమైనా అనొచ్చా ?

ఈ ప్రశ్నకు చాలా మంది చాలా తేలికగా చెప్పే సమాధానం ఒక్కటే.. ఏమైనా అనొచ్చని. ఏమైనా అనొచ్చంటే ఎంతైనా అనొచ్చని కాదని వాళ్లు తెలుసుకోలేకపోతున్నారు. విమర్శకు, తిట్టుకు తేడా తెలియకుండా కొందరు రాజకీయ నాయకులను, సెలబ్రిటీలను పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడి ఈమధ్య ఓ ఆంధ్రా యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి కటకటాల పాలైన విషయం తెలిసిందే. ఫూటుగా తాగి నోటికి అడ్డూ అదుపులేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చిక్కులు తప్పవని సైబర్ చట్టాలు హెచ్చరిస్తున్నాయి.

చేతిలో స్మార్ట్‌ఫోన్ వుంది కదా అని తమ ఇష్టానుసారంగా వీడియోల్లో తిట్టేసి అప్‌లోడ్ చేస్తే ఊరుకోవు చట్టాలు. ఇలాంటివాళ్ల వల్ల టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికలు భ్రష్టుపట్టి పోతున్నాయనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఎటూ సోషల్ మీడియానే అనే భావనను వీడి కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మంచి వీడియోలు చేసుకుంటే అటు సంస్థకూ, ఇటు సమాజానికి బాగుంటుంది. ఒక్కరు చేసిన తప్పుకు ఎందరో శిక్ష అనుభవించినట్టు అవుతుంది కాబట్టి ఆలోచించాల్సిందే. ప్రపంచంలో చాలా సమస్యలు వున్నాయి. వాటిని అటు అధికారులు, ఇటు సమాజం దృష్టికి తీసుకెళ్లొచ్చు. అధికారులు పట్టించుకోకపోతే ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలు హద్దు దాటనంత వరకు బాగానే వుంటుంది.

బూతు కామెంట్లపై కూడా నిషేధం రావాలి…

ఇదిలావుంటే మరొక సోషల్ మీడియా రోగం ఏంటంటే యూట్యూబ్‌లో వీడియోల కింద కొంతమంది బూతులతో చెలరేగిపోతుంటారు. వీడియో నచ్చితే నచ్చింది, లేకపోతే లేదని అభిప్రాయం చెప్పాలి. కానీ తిట్టే అధికారం ఎవ్వరికీ లేదు.

వేలల్లో కామెంట్లు బూతులమయంగా వుంటాయి. వాటిని చాలామంది పట్టించుకోరు గానీ కొందరు అలాంటి కామెంట్ల వల్ల మనసు బాధపడిందని వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కొందరైతే ఫలానా హీరో ఫ్యాన్స్ అంటూ పరమ నీచమైన భాషలో వీడియోలు చేస్తూ అప్‌లోడ్ చేసేస్తున్నారు. సదరు హీరోను ఎవరైనా విమర్శిస్తే ఇక ఆ మంద బండ బూతులతో దాడి చేస్తుంది. ఇలాంటి కామెంట్లు, వీడియోలపై కూడా బ్యాన్ విధించాలని బాధితులు కోరుతున్నారు. ఉన్న వేదికలను ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ విధంగా వినియోగించుకుంటే మంచిదని సైబర్ క్రైం అధికారులు హెచ్చరిస్తున్నారు.