AP: 45-year-old women have a chance till the 11th of this month
mictv telugu

ఏపీ: 45 ఏళ్ల మహిళలకు జగన్ తీపికబురు..ఈ నెల 11వరకు ఛాన్స్

September 10, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వైఎస్సార్ చేయూత పథకం’ కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విడతలవారీగా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 45 ఏళ్ల వయసు నిండి, పథకానికి కావాల్సిన అర్హతలు పొందిన మహిళలకు మరోసారి అవకాశాన్ని కల్పిస్తూ, సీఎం జగన్ ఓ తీపికబురు చెప్పారు. వైఎస్సార్ చేయూత పథకం దరఖాస్తు గడువును ఈ నెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ, ఓ ప్రకటన విడుదల చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో..”ఈ ఏడాది 45 ఏళ్ల వయసు నిండి, అర్హత పొందిన మహిళలకు కూడా వైఎస్సార్ చేయూత పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల్లోని 45-60 మధ్య వయసున్న మహిళలు దరఖాస్తులు చేసుకోండి. ఈ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం అందజేయనున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి పైగా మహిళలకు రూ. 9,179.67 కోట్ల మొత్తాన్ని లబ్దిదారులకు అందజేశాం. ఈ నెల 22వ తేదీన వైఎస్సార్ చేయూత మూడో విడత ఆర్థిక సహాయం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తుల గడువును నిర్ధారించాం. దానిని ఏడవ తేదీ వరకు పొడిగించాం. మళ్లీ ఆ గడువును ఈ నెల 11 వరకు పొడిగించాం. కనుకు అర్హులైన మహిళలు దరఖాస్తులు చేసుకోండి” అని పేర్కొన్నారు.

వైఎస్సార్ చేయూత పథకం విషయానికొస్తే.. ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి మొత్తంగా రూ.75 వేల ఆర్థిక సాయం లభిస్తుంది. అయితే, ఈ డబ్బులు ఒకేసారి కాకుండా ప్రతి ఏటా ఒకసారి విడతల వారీగా లబ్ధిదారులకు చేరుతుంది. ఒక్కో విడత కింద రూ.1,8750 లభిస్తాయి. ఇప్పటికే రెండు విడతల డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. అంటే ఇంకో రెండు విడతల డబ్బులు మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
1. ఆధార్ కార్డ్
2. కుల ధృవీకరణ పత్రం
3. నివాస ధృవీకరణ పత్రం
4. వయస్సు రుజువు
5. బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
6. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
7. మొబైల్ నంబర్
8. రేషన్ కార్డు