AP: Admissions in 100 degree colleges suspended!..
mictv telugu

ఏపీ: 100 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేత!..

September 14, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో ఉన్న 100 డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. అంతేకాదు, ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేస్తూ, అధికారులు కౌన్సెలింగ్ జాబితా నుంచి వాటిని తొలగించారు. ఆ కాలేజీల్లో ఎందుకు ప్రవేశాలు నిలిచిపోనున్నావో?, జాబితా నుంచి ఆ కాలేజీలను ఎందుకు తొలగించారు? అనే తదితర అంశాలపై అధికారులు వివరాలను తెలియజేశారు.

”నిబంధనలు పాటించని 100 డిగ్రీ కాలేజీలను రద్దు చేయబడ్డాయి. అందుకు కారణం.. అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేవు. దాదాపు 100 ప్రైవేటు డిగ్రీ కశాశాలలపై ఆయా యూనివర్సిటీలు చర్యలు తీసుకున్నాయి. వీటిలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతో వాటిని కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించాయి. తొలుత ఈ కళాశాలలకు అనుమతులు లభించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో మళ్లీ తనీఖీలు నిర్వహించి, సౌకర్యాలపై ఆరా తీశారు. చివరికి ఈ నిర్ణయానికి వచ్చారు” అని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు అన్నారు.

అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేని 100 కాలేజీల అనుమతులపై సోమవారం పాలకవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేశారు. అయితే, ప్రస్తుతం ఆయా కాలేజీల్లో చదువుతున్న ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం మాత్రం కళాశాలలు కొనసాగుతాయని తెలియజేశారు. మొదటి సంవత్సరంలో మాత్రం ఎలాంటి ప్రవేశాలు ఉండవని పేర్కొన్నారు. ఒకవేళ కనుక లోపాలను సరిదిద్దుకుంటే మాత్రం వచ్చే ఏడాది పరిశీలించి అనుమతులు ఇస్తామని అవకాశం ఇచ్చారు. కాగా, డిగ్రీలో ప్రవేశాలకు జులై 22న నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటి వరకు కౌన్సెలింగ్ పూర్తి కాలేదు.