AP: Assembly meetings begin..commotion over job calendar
mictv telugu

ఏపీ: అసెంబ్లీ ప్రారంభం..జాబ్‌ క్యాలెండర్‌పై రచ్చ

September 15, 2022

ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే రచ్చ మొదలైంది. సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జాబ్‌ క్యాలెండర్‌ జాబ్‌లెన్‌ క్యాలెండర్‌ అయిందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. స్పీకర్‌ పోడియం వద్దకు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.

దీంతో టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. అయినా, జాబ్ క్యాలెండర్, జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో స్పీకర్..ప్రశ్నోత్తరాలకు వెళ్దామనడంతో.. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఓవైపు టీడీపీ సభ్యులు ఆందోళన, మరోవైపు నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. టీడీపీ సభ్యులు సభకు గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని మంత్రి బుగ్గన మండిపడ్డారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు.

మంత్రి బుగ్గన మాట్లాడుతూ..”ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం సరైంది కాదు. టీడీపీ సభ్యులు సభా సాంప్రదాయాలు పాటించడం లేదు. కరోనా టైమ్‌లో ప్రశ్నోత్తరాలు పెట్టమని గొడవ చేసిన టీడీపీ ఇప్పుడు వద్దంటోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే..ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా..వాళ్లు ఊరుకోవం లేదు. ఇదెక్కడి ఆచారం” అని ఆయన అన్నారు.