మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ

February 28, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 7వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు సోమవారం ఏపీ ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అంటే.. దాదాపు మూడు వారాల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశాల నిర్వహణకు సంబంధించి బీఏసీ సమాశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అంతేకాకుండా సమావేశాల్లో తొలి రోజైన మార్చి 7న ఇటీవలే అకాల మరణం చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలుపనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముంది. ఇప్పటికే బడ్జెట్‌పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తైంది. ఈ సారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.