విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా అంశం గత ఎన్నికల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. కేవలం దీని ప్రభావంతోనే చంద్రబాబు ఓడిపోయారంటే అతిశయోక్తి కాదు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి సీఎం వైఎస్ జగన్ హోదా విషయంలో చంద్రబాబును తెలివిగా ఇరికించి అధికారం కైవసం చేసుకున్నారనే అభిప్రాయం కూడా ఉంది. తర్వాత హోదా తెస్తానని రికార్డు స్థాయిలో గెలిచిన జగన్.. ఎందుకు తేలేకపోతున్నారని ఇప్పుడు టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా హోదా అంశం మరోసారి చర్చకు వచ్చింది. పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేశామని తేల్చి చెప్పారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి పార్లమెంట్ సాక్షిగా రూ. 15 వేల కోట్లు ఇచ్చామని ఇంకా కొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇలా మూడు పార్టీల మధ్య నలుగుతున్న హోదా అంశం చివరికి ఏమవుతుందో వేచి చూడాల్సి ఉంది. ఇక కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన సోము వీర్రాజు.. తుంగభద్రపై నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల రాయలసీమకు దక్కాల్సిన వాటాలో అన్యాయం జరక్కుండా చూస్తామని హామీ ఇచ్చారు.