AP: Botsa Satyanarayana Sweets will be distributed to the poor from August 1.
mictv telugu

ఏపీ: నిరుపేదలకు బొత్స సత్యనారాయణ తీపికబురు..ఆగస్ట్ 1 నుంచి పంపిణీ

July 26, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ తీపికబురు చెప్పారు. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లోని నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) పథకం కింద అన్నీ రేషన్‌ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నామని తెలిపారు. సచివాలయంలో ఈ ఉచిత బియ్యం పంపిణీపై సోమవారం అధికారులతో ఆయన చర్చలు జరిపారు.

అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..”రాష్ట్రంలో ప్రతినెల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా 4.23 కోట్ల మందికి రేషన్‌ ఇస్తుంటే, ఇందులో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే సరుకులు అందిస్తోంది. మిగిలిన లబ్ధిదారులకు సొంత ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వమే రేషన్‌ పంపిణీ చేస్తోంది. కరోనా సమయంలో పీఎంజీకేవై కింద కేంద్రం ఉచిత రేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2022 వరకు రాష్ట్రంలో ఉచిత రేషన్‌ పంపిణీ చేపట్టాం. ఇక్కడ కేంద్రం ఇచ్చే వాటాపోనూ నాన్‌–ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మానవతా దృక్పథంతో మా ప్రభుత్వం సొంతంగా ఉచిత బియ్యాన్ని అందించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కొనసాగిస్తున్న ఉచిత రేషన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి మరోసారి ప్రభుత్వం సన్నద్దమయ్యింది” అని ఆయన అన్నారు.