AP: Candidates..exams from today till 21st
mictv telugu

ఏపీ: అభ్యర్థుల్లారా..ఇవాళ్టి నుంచి 21 వరకు పరీక్షలు

August 6, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీ టెట్) ఆగస్టు 2022 నేటి నుంచి ప్రారంభమై, ఈ నెల 21 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలో కంప్యూటరాధారితంగా జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

టెట్ నిర్వహణ అధికారులు మాట్లాడుతూ..”ఏపీతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోనూ పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశాం. ఇంతకు ముందు టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఏడేళ్లుగా ఉండేది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పు చేసి, జీవితకాలంగా చెల్లుబాటు అయ్యేలా నిర్ణయించింది (అంటే ఈ ఏపీ టెట్‌లో క్యాలిఫైయితే ఇక నుంచి జీవితకాలం వ్యాలిడిటి)” అని అన్నారు.

మరోపక్క ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నామని తెలుపడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితోపాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం..రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు.