AP: Candidates..hall tickets from today
mictv telugu

ఏపీ: టెట్ అభ్యర్థుల్లారా..నేటి నుంచే హాల్‌ టికెట్లు

July 26, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీ టెట్‌)కు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. ఈరోజు నుంచి టెట్ హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్స్ https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. అంతేకాదు, జులై 26 నుంచి మాక్‌ టెస్ట్‌లు కూడా అందుబాటులో ఉంటాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ మాక్‌ పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

తాజాగా ఏపీ టెట్‌ పేపర్‌-2 ఏ అర్హతల్లో మార్పు చేస్తూ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ”ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉన్నా పేపర్‌-2ఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఒక్కసారికి మాత్రమే ఈ సడలింపు ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా బీఈడీ చేసేందుకు అర్హత కల్పిస్తుంది. అందుకని టెట్‌ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టాం. రిజర్వేషన్‌ క్యాటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నందున ఈ మార్పు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

మరోపక్క ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు టెట్‌ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో 20 శాతం వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1 (ఏ, బీ), 6-8 తరగతుల బోధనకు పేపర్-2 (ఏ, బీ) లో అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ జూన్ 16 నుంచి ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చారు.