జగన్ మరో సంచలనం.. అన్ని బార్ల లైసెన్సులు రద్దు  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ మరో సంచలనం.. అన్ని బార్ల లైసెన్సులు రద్దు 

November 22, 2019

 AP Cm jagan decision bar licenses cancelled   

సంపూర్ణ మద్యనిషేధం దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మందుబాబులకు మరో గట్టి షాకిచ్చారు. రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులు ఈ రోజు రద్దు చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 

నిజానికి బార్లకు డిసెంబరు 31 వరకు లైసెన్సు ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో అవి మూతపడనున్నాయి. బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకే మూయిస్తోంది. వచ్చే ఏడాది జనవరి కొత్త మద్య విధానం అమల్లోకి రానుండడంతో 2020-2021 ఏడాదికి గాను తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త విధానం కింద బార్లకు రెండేళ్లు మాత్రమే లైసెన్సు ఉంటుంది. లైసెన్సు ఫీజు కింద దరఖాస్తుకు రూ.10 లక్షలు కట్టాలి. లాటరీ ద్వారా బార్లను కేటాయిస్తారు. వాటిని పొద్దున 11 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూయాల్సి ఉంటుంది. ఏపీలో మొత్తం 798 బార్లు ఉండగా కొత్త విధానంతో వాటి సంఖ్య 479కి పడిపోనుంది. 38 త్రీ స్టార్ హోటళ్లకు, 4 మైక్రో బేవరేజ్‌లకు అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం మద్యం ధరలను కూడా పెంచనుంది.